దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మరి
దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్‌లో పంజా విసురుతోంది. దాదాపు 22 రోజుల తర్వాత 14 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కల్గిస్తోంది.;
దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్‌లో పంజా విసురుతోంది. దాదాపు 22 రోజుల తర్వాత 14 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కల్గిస్తోంది. గడిచిన 24 గంటల్లో 13,993 మంది వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఆరువేలు దాటగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనూ 4,505 కేసులు, 15 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటితో పాటు పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ కొత్త కేసులు అధికమవుతున్నాయి.
కరోనా కేసులు పెరుగుతుండటంతో బృహన్ ముంబై కార్పొరేషన్ నిబంధనలు కఠినతరం చేసింది. మాస్క్‌లు ధరించకుండా పట్టుబడిన 13వేల మంది నుంచి శుక్రవారం రూ.27 లక్షలు వసూలు చేసింది. ఇక పది నెలల్లో 15 లక్షల మంది నుంచి రూ.31 కోట్లు రాబట్టింది. కరోనా సోకిన వారు బయటకు వస్తుండటాన్ని బీఎంసీ తీవ్రంగా పరిగణిస్తోంది. వీరు ఉంటున్న ప్రాంతాల్లోని 1,305 భవనాలను సీల్ చేసింది. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారు కరోనా నెగెటివ్ రిపోర్టు చూపాలని, లేదంటే వెనక్కి పంపుతామని ప్రకటించింది.
కరోనా ప్రభావం ఈ ఏడాదంతా ఉంటుందని మహారాష్ట్రకు చెందిన ఎపిడెమియాలజీ నిపుణుడు డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. కరోనా చాలా తీవ్రమైనదని.. ప్రతి కేసును చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలు విస్తృతం చేయాలని ఆయన సూచించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల అమలులో అలసత్వం ప్రదర్శించొద్దని రాష్ట్రాలకు సూచించింది.