ఆలయంలో అద్భుతం.. పూజారి మాట విన్న మొసలి..

ఆయన మాట విన్న మొసలి నిజంగానే తను వచ్చిన దారిన వెళ్లిపోయింది.

Update: 2020-10-22 11:16 GMT

ఆలయాల్లో అప్పుడప్పుడు అద్భుతాలు జరిగి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా కేరళ ఆలయంలోకి ఓ మొసలి వచ్చింది. దాన్ని చూసి భయపడని పూజారి అనునయంగా బుజ్జగించే ప్రయత్నం చేశారు. వినమ్రంగా నమస్కరిస్తూ బయటకు వెళ్లాలని కోరారు. ఆయన మాట విన్న మొసలి నిజంగానే తను వచ్చిన దారిన వెళ్లిపోయింది. కసరగడ్ జిల్లా అనంతపురం ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో ఒక శాఖాహార మొసలి ఉంది. దానిని బలియా అని పిలుస్తారు.

చాలా కాలం నుంచి ఆ మొసలి ఆలయానికి కాపలాగా ఉంటోంది. గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని తింటూ సాధు స్వభావిగా మారిపోయింది. తన అసలు స్వరూపాన్ని మర్చిపోయింది. అయతే ఎప్పుడూ నీటిలో ఉండే మొసలి ఆలయంలోకి వచ్చిన దాఖలాలు మునుపెన్నడూ లేవని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ చెప్పారు. కాగా మొసలి ఆలయానికి కాపలా కాయడం వెనుక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది.

70 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఇక్కడ సరస్సులో ఉన్న మొసలిని చంపేశాడట. తరువాత ఆ సైనికుడు పాము కాటుకు గురై మరణించాడట. ఆ దైవమే అతడిని చంపిందని స్థానికులు విశ్వసిస్తారు. కానీ ఆ మొసలి మరణించిన కొద్ది రోజులకే మరో మొసలి ఆ సరస్సులోకి చేరిందని.. ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించిన మొసలి అదే అని భక్తులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News