Uttarakhand Floods : ఉత్తరాఖండ్‌లో 32కి చేరిన మృతుల సంఖ్య

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ జలవిలయం విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 32 మంది మృతి చెందగా... మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Update: 2021-02-10 11:00 GMT

ఉత్తరాఖండ్‌ జలవిలయం విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 32 మంది మృతి చెందగా... మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గల్లంతైన 175 మంది ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సొమవారంనాటికి 26 మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. నిన్న మరో ఐదు మృతదేహాలను బురద, శిథిలాల నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే రెండు రోజులు దాటిన నేపథ్యంలో.. గల్లంతైనవారి క్షేమంపై ఆందోళన పెరిగిపోతోంది. మరోవైపు.. తపోవన్‌, విష్ణుగడ్‌ జల విద్యుత్‌ కేంద్రం సొరంగంలో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలను ఐటీబీపీ, ఆర్మీ దళాలు ముమ్మరం చేశాయి. 12 అడుగుల ఎత్తు, రెండున్నర కిలోమీటర్ల పొడవున ఉన్న టన్నెల్‌లో చాలా భాగం బురద పేరుకుపోయింది. దీంతో శిథిలాలను తొలగించి లోపలికి వెళ్లడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇప్పటికే 120 మీటర్ల మేర బురదను తొలగించారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముంపు ప్రాంతంలో మంగళవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాగా.. ఉత్తరాఖండ్‌ జలప్రళయంపై హోం మంత్రి అమిత్‌షా... ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. NTPC ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగంలో చిక్కుకున్న 35 మందిని కాపాడేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. లోపల చిక్కుకున్నవారిని సంప్రదించడం ఇప్పటివరకు సాధ్యం కాకపోయినా వారు ప్రాణాలతో ఉండే అవకాశమైతే ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వంతెన కొట్టుకుపోవడం వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన 13 గ్రామాలవారికి నిత్యావసరాలను హెలికాప్టర్ల ద్వారా పంపిస్తున్నారు.

ఏళ్ల తరబడి కొనసాగిన గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రతల వల్ల రాతి శిలలు బలహీనపడిందని దీనివల్ల ఆ ప్రాంతంలోని రాళ్లల్లో పగుళ్లు ఏర్పడి మంచు చరియలు విరిగి, కరిగిపోయాయని.. జలప్రళయానికి కారణం అదేనని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో వారు హెలికాప్టర్‌ సర్వే నిర్వహించారు. ఆ ప్రాంతం మరీ ఎక్కువ ఏటవాలుగా ఉండడంతో కరిగిన మంచు వేగంగా ధౌలిగంగా నదిలోకి ప్రవహించి.... ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. మరోవైపు..

కేంద్ర జల కమిషన్‌ కూడా ఈ ఉత్పాతానికి కారణం కొండచరియలు విరిగిపోవడమేనని.. మంచు సరస్సు విస్ఫోటం వల్ల జరిగింది కాదని చెబుతోంది. అయితే ఉపగ్రహ చిత్రాలకు అందకుండా చిన్న చిన్న జలవనరులు ఏవైనా ఉంటే అవి వరదలకు కారణమై ఉంటాయని సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ శరత్‌ చంద్ర అభిప్రాయపడ్డారు. ఈ ఉత్పాతానికి కారణాలను కనుగొనేందుకు కమిషన్‌ ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 

Tags:    

Similar News