Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మరో ఛార్జ్‌షీట్‌

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ వేసిన మరో ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.;

Update: 2022-12-21 06:29 GMT

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ వేసిన మరో ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సమీర్‌ మహేంద్రుపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవితతోపాటు, వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి పాత్రను వివరించింది. ఈ కేసులో బోయినపల్లి అభిషేక్‌, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్టు ఈడీ కోర్టుకు వివరించింది.


ఇండోస్పిరిట్స్‌ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అని తెలిపింది ఈడీ. ఇండో స్పిరిట్స్‌కు ఎల్‌-1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగం మోపింది. ఇండో స్పిరిట్‌లో రామచంద్ర పిళ్లై వెనుక ఉన్నది కవిత అని ఈడీ తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తరఫున ప్రేమ్‌ రాహుల్‌ పనిచేస్తున్నారని ఛార్జ్‌షీట్‌లో వివరించింది. ఈ సంస్థ మద్యం విక్రయం ద్వారా దాదాపు 193 కోట్లు సంపాదించిందని వివరించింది.


వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, కె.కవిత, శరత్‌రెడ్డి నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌.. 100 కోట్ల రూపాయల ముడుపులను విజయ్‌నాయర్‌కు ఇచ్చిందని ఆరోపించింది. ఇది ఆమ్‌ఆద్మీ పార్టీ నేతల మధ్య కుదిరిన డీల్‌గా వెల్లడించింది. దీని ప్రకారం వంద కోట్లను ముందస్తుగా చెల్లించినట్టు ఈడీ వివరించింది. ఈ వంద కోట్లు వసూలుకు వీలుగా ఇండోస్పిరిట్‌లో 65 శాతం వాటాను సౌత్‌గ్రూప్‌నకు ఇచ్చిందని, ఈ వాటాను అరుణ్‌పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌ అనే బినామీ ప్రతినిధులతో నడిపించారని ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. ఈ కేసులో పాత్ర ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారని, ఇందులో కవిత ఫోన్లు పది ధ్వంసమైనట్టు తెలిపింది.


అరుణ్‌పిళ్లై మూడున్నర కోట్లు పెట్టుబడి పెడితే.. 32 కోట్ల 26 లక్షల లాభం వచ్చినట్లు ఈడీ వివరించింది. ప్రేమ్‌ రాహుల్‌ 5 కోట్లు పెట్టినా ఎలాంటి లాభం చూపించలేదని తెలిపింది. ప్రేమ్‌ రాహుల్‌ను డమ్మీగా చూపించి 65 శాతం వాటాను అరుణ్‌ పిళ్లై తీసుకున్నారని ఈడీ చెబుతోంది. ఇక ఇండో స్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌ తరఫున సమీర్‌ మహేంద్రు 35శాతం వాటాగా 5 కోట్ల పెట్టుబడితో 35శాతం లాభం పొందారని తెలిపింది. వీరిపై మనీలాండరింగ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది.

Tags:    

Similar News