అందుబాటు ధరలో అందరికీ ఇళ్లు.. రూ.40 లక్షల్లో ఫ్లాట్
మధ్యతరగతి వాసుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టాయి. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్;
రూ.40 లక్షల్లో ఇల్లొచ్చేస్తుందా.. నాకూ ఒకటి బుక్ చేయరా బాబు.. నగరంలో ఇల్లు కొనాలంటే ఊళ్లో ఉన్న రెండెకరాల పొలం, పుట్రా అమ్ముకోవాల్సి వస్తుందని బాధ పడుతున్నా. రూ.40 లక్షల్లో వస్తే నాక్కాస్త వెసులుబాటుగా ఉంటుంది.. ఆకాశాన్నంటుతున్న ఆ ధరలని చూస్తే గుండె గుభేల్‌మంటుంది. మధ్యతరగతి వాసుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టాయి. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రూ.40 లక్షలకే వచ్చేలా నిర్మాణం చేపడుతున్నాయి.
కొన్ని సంస్థలు ఇప్పటికే నిర్మాణం చేపట్టగా, మరి కొన్ని ప్రాజుక్టులు కొత్త ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ఈ ధరలో ఇళ్లు ఎక్కడో అవుట్స్ కట్స్‌లో దొరికేవి.. అయితే ఇప్పుడు కొన్ని పెద్ద సంస్థలు రంగంలోకి దిగడంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో భారీ ఎత్తున నగరం నడిబొడ్డున నిర్మించడానికి సన్నహాలు చేస్తున్నాయి. రాబోయే రెండు మూడేళ్లలో 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది వేల ఫ్లాట్లు దశలవారీగా రానున్నాయి. గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, మొదటి సారి ఇల్లు కొనే వారికి కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.2.60 లక్షల వరకు ఇస్తుండడంతో కొనుగోలు దారుల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్మాణ సంస్థలు అంటున్నాయి.
ఇప్పటికే బాచుపల్లిలోని ఓ సంస్థ 3600 యూనిట్లను, నార్సింగిలో మరో సంస్థ 1600 యూనిట్లను కట్టబోతున్నాయి. ఇంకా కిస్మత్‌పూర్, ఆదిభట్ల, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రారంభానికి ముందే బుకింగ్ చేసుకోవడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలో అన్ని సౌకర్యాలు ఉంటాయి.. అయితే అంతే స్థాయిలో ధరలూ ఉంటాయి.. కనీసం రూ.65 లక్షలన్నా లేనిదే ఆ ఆకాశహర్మాల్లో ఫ్లాట్ బుక్ చేయలేని పరిస్థితి.. మరిన్ని వసతులు ఉంటే కోటి పైమాటే. ఇక నుంచి ఇలాంటి గేటెడ్ కమ్యూటీల్లో కూడా రూ.40 లక్షలకే ప్లాట్ ఇస్తామంటున్నారు నిర్మాణదారులు. అన్ని సౌకర్యాలు.. మార్కెట్లు, కాఫీ షాపులు, బ్యాంకులు, క్లినిక్‌లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
ఇక ఫ్లాట్ విస్తీర్ణం కూడా 800 చ.అడుగుల నుంచి 975 చ.అడుగుల వరకు ఉన్నాయి. పీఎంఎవై నిబంధనల ప్రకారం 650 చ. అడుగులు ఉండాలి. ఆపై విస్తీర్ణాన్ని ఇతర అవసరాలకు చూపిస్తున్నాయి. సౌకర్యాలు, అపార్ట్‌మెంట్ కట్టిన ఏరియాని బట్టి రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఇంటి ధర ఉండొచ్చని అంటున్నారు. వీటిలో ఎక్కువ సంస్థలు అన్ని సౌకర్యాలతో రూ.40 లక్షలకే అందిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో మారిన ఈ కొత్త రూల్స్ సొంత ఇంటి కలను నిజం చేస్తున్నాయి.