గరం గరం ఛాయ్.. కాగితపు కప్పుల్లో డేంజర్ భాయ్: ఐఐటీ ఖరగ్‌పూర్
కస్టమర్ల ఆరోగ్యం ఆస్పత్రికి అంకితం..;
ఒకప్పుడు ఛాయ్ అంటే కప్పులు, గాజు గ్లాసులు.. హోటల్‌కి వెళితే వన్ బై టూ అంటూ అరుపులు.. ఇప్పుడు ఓ నాలుగు సిప్పుల్లో అయిపోయే పేపర్ కప్పులు.. కాలంతో పాటు మారిన తీరు.. కస్టమర్ల ఆరోగ్యం ఆస్పత్రికి అంకితం..
కాగితంతో తయారు చేసిన కప్పుల నుండి టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒక వ్యక్తి వాటిలో రోజుకు మూడు సార్లు టీ తాగితే, 75,000 మైక్రోస్కోపిక్ కణాలు అతని శరీరంలోకి వెళతాయని ఐఐటి ఖరగ్‌పూర్ అధ్యయన పరిశోధకులు వెల్లడించారు.
పరిశోధనకు నాయకత్వం వహించిన ఐఐటి ఖరగ్‌పూర్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ మాట్లాడుతూ, ఒకసారి వాడి పడేసే కాగితపు కప్పుల్లో పానీయాలు తాగడం సర్వసాధారణం. అయితే "ఈ కప్పుల్లోని హానికరమైన పదార్థాల వల్ల వేడి ద్రవ పదార్థం కలుషితమవుతుందని మా పరిశోధన నిర్ధారించింది. ఈ కప్పులను తయారు చేయడానికి, సాధారణంగా హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొర అమర్చబడుతుంది. ఇది ప్రధానంగా ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. దాని సహాయంతో, కప్పులోని ద్రవం అలాగే ఉంటుంది. ఈ పొర వేడి నీటిని కలిపిన 15 నిమిషాల్లో కరగడం ప్రారంభిస్తుంది. " అని అన్నారు.
ప్రతిరోజూ మూడు కప్పుల టీ లేదా కాఫీ తాగే వ్యక్తి శరీరంలోకి 75,000 సూక్ష్మ కణాలు వెళ్తాయి, అవి కళ్ళకు కనిపించవు. "ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అని అన్నారు.
ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ చదువుతున్న పరిశోధకులు అనుజా జోసెఫ్, వేద్ ప్రకాష్ రంజన్ ఈ పరిశోధనలో గోయల్‌కు సహాయం చేశారు. ఐఐటి ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీరేంద్ర కె తివారీ మాట్లాడుతూ "ప్రమాదకర జీవ ఉత్పత్తులు మరియు పర్యావరణ కాలుష్య కారకాల స్థానంలో వాటి వాడకాన్ని ప్రోత్సహించే ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం తెలియజేస్తుంది."