వరుసగా ఐదు రోజులుగా రైతులు అదే పట్టుదలతో ఉన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరస్థితుల్లోనూ తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేది లేదంటూ ఢిల్లీ సరిహద్దుల్లో భీష్మించుకుని కూర్చొన్నారు. చలిలోనూ.. తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. లాఠీ చార్జ్‌లు... వాటర్ కేనన్‌ల దాడులను తట్టుకుని.. ఎదురు నిలబడుతున్నారు.
పంజాబ్, యూపీకి చెందిన పలు రాష్ట్రాల రైతు సంఘాలతో ఢిల్లీ శివార్లలోని బురారీలో కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. అయితే.. రైతులు మాత్రం షరతులతో చర్చలకు ససేమిరా అంటున్నారు. జంతర్‌మంతర్‌లో నిరసనలు తెలపడానికే మొగ్గు చూపుతున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తాము ఆందోళనలు విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు.
రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో... కేంద్ర హోం మంత్రి అమిత్ షా... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి తోమర్ నిన్న అర్థరాత్రి సమావేశమయ్యారు. రైతుల ఆందోళనలనపనై ఏం చేద్దామని సీరియస్‌గా చర్చించినట్టు సమాచారం. ఢిల్లీ ఐదువైపులా రోడ్డును నిర్బంధిస్తామని.. రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా.. వీరి మధ్య చర్చకు వచ్చాయి.
ఇప్పటికీ పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గాల్లో లక్షల మంది రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అంత చలిలోనే అక్కడే వంటలు చేసుకుంటూ... నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిరంకారీ మైదాన్‌కు చేరుకున్న పలువురు.. అక్కడే ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లోనూ వేల మంది రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సింఘు బార్డర్‌లో... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. నిరసనలు చేపడుతున్నారు. యూపీ బార్డర్‌లోనూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో టిక్రి, సింఘు బార్డర్‌లను ఢిల్లీ పోలీసులు మూసివేశారు. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఉత్తరాఖండ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల బారికేడ్లను పక్కకు తోసి రైతులు ముందుకు కదులుతున్నారు.