ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం.. జనవరి 7న ట్రాక్టర్లతో మార్చ్‌!

Update: 2021-01-06 01:56 GMT

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమవుతోంది.. కేంద్రంతో ఏడోసారి కూడా చర్చలు ఎటూ తేలకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.. గురువారం ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్లతో మార్చ్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఢిల్లీ సమీపంలోని నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.. ఆ మార్చ్‌ ద్వారా ఈనెల 26న చేపట్టబోయే కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్‌ను కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి.

వాస్తవానికి జనవరి 8వ తేదీన రైతులు-కేంద్రం మధ్య ఎనిమిదో దశ చర్చలు ఉన్నాయి. దానికి ఒక్క రోజు ముందే రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దలోనే రైతులంతా మకాం వేసి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు నుంచి రెండువారాలపాటు దేశ్‌ జాగ్రన్‌ అభియాన్‌ ప్రారంభించనున్నట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈనెల 23న వివిధ రాష్ట్రాల్లోని గవర్నర్ల ఇళ్ల వైపు కవాతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు పంజాబ్‌కు చెందిన బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆరు వారాలుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ మాజీ మంత్రి సూర్జీత్ కుమార్ జ్యానీ, హర్జీత్ సింగ్ గ్రెవాల్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు మోదీని తన నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. పంజాబ్‌‌కు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకే మోదీని కలిసినట్టు చెప్పారు. అయితే, ఆ సమస్యలు ఏంటన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

మరోవైపు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎండగట్టారు. మోదీ ప్రభుత్వ అహంకారం 60 మంది రైతులను బలితీసుకుందన్నారు. భాష్పవాయువుతో వారిపై దాడిచేస్తోందని మండిపడ్డారు. సాగు చట్టాలను రద్దు చేయండంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఈనెల 26న కిసాన్‌ పరేడ్‌ ఫేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో మహిళలు కూడా భాగస్వాములు కానున్నారు. ఇందుకోసం వారు డ్రైవింగ్‌ కూడా నేర్చుకుంటున్నారు.


Tags:    

Similar News