HIV: ఇక తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ రాదు
అద్భుతం చేసిన డెన్మార్క్ వైద్యులు... హెచ్ఐవీ బిడ్డకు సోకకుండా విజయం.. మెరుగైన చికిత్స ద్వారా సాధ్యమే
ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులను నియంత్రించడం ఆరోగ్య రంగానికి పెద్ద సవాలుగా మారిన సందర్భంలో డెన్మార్క్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవీ- సిఫిలిస్ వంటి వ్యాధులు సంక్రమించకుండా పూర్తిగా అడ్డుకోవడంలో ఆ దేశం విజయం సాధించింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ధృవీకరించడం అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్లో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా డెన్మార్క్ నిలవడం విశేషం. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సమర్థవంతమైన ఆరోగ్య విధానాలు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఈ విజయానికి కారణమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఫిబ్రవరి 27, 2026న ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో డెన్మార్క్ సాధించిన ఈ విజయాన్ని ధృవీకరించింది. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ మరియు సిఫిలిస్ వ్యాధుల సంక్రమణను పూర్తిగా అడ్డుకోవడంలో ఆ దేశం సాధించిన ఫలితాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది. ఆరోగ్యరంగంలో ఇది ఒక గొప్ప మైలురాయి మాత్రమే కాకుండా మానవ హక్కుల పరిరక్షణలో కూడా ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.
డెన్మార్క్ సాధించిన ఈ విజయం ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ, సిఫిలిస్ వ్యాప్తిని నిర్మూలించడం అనేది కేవలం ఆరోగ్య విజయం మాత్రమే కాదు.. అది మానవ హక్కుల విజయం కూడా అని ఆ సంస్థ ప్రశంసించింది. సాధారణంగా హెచ్ఐవీ లేదా సిఫిలిస్ ఉన్న గర్భిణీ స్త్రీల నుంచి పుట్టబోయే బిడ్డకు ఆ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ, సరైన సమయంలో యాంటిరెట్రోవైరల్ చికిత్సతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తే ఈ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. డెన్మార్క్ ఇదే సూత్రాన్ని పక్కాగా అమలు చేసి చూపెట్టింది. క్యూబా, థాయిలాండ్ వంటి కొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నా, యూరోపియన్ యూనియన్ నుంచి ఈ ఘనత సాధించిన దేశం మాత్రం డెన్మార్క్ కావడం విశేషం.. భారత్ వంటి దేశాల్లో కూడా తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమణను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ మరియు సిఫిలిస్ వ్యాధుల సంక్రమణను పూర్తిగా అడ్డుకోవడంలో డెన్మార్క్ విజయం ప్రపంచ ఆరోగ్య రంగానికి గొప్ప సందేశంగా నిలిచింది.