'డీజిల్‌కి‌ పైసలివ్వు.. నీ బిడ్డను వెతికి పెడతాం' : పోలీసుల నిర్వాకం ఇది!

సామన్య ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు గడప తొక్కితే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ వెళ్ళిన పని కావాలంటే ఖాకీల చేతులు తడపాల్సిందే.;

Update: 2021-02-02 08:20 GMT

సామన్య ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు గడప తొక్కితే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ వెళ్ళిన పని కావాలంటే ఖాకీల చేతులు తడపాల్సిందే. లేదంటే కంప్లైంట్‌ పక్కకు పడేస్తారు. అన్నీ చోట్లల్లో ఇలా లేకపోవచ్చు కానీ చాలా చోట్లల్లో మాత్రం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన..

తన బిడ్డ కనిపించడం లేదు కాస్తా వెతికిపెట్టండని పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ పట్ల అధికారాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం వికలాంగురాలని దయ కూడా చూపించలేదు. పైగా ఆమె దగ్గర 15 వేల రూపాయల వరకు వసూలు చేశారు. కానీ ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇదేటండి అని ప్రశ్నిస్తే కుమార్తె క్యారెక్టర్‌ గురించి అసభ్యంగా మాట్లాడారు. దీనితో విసిగిపోయిన ఆ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌కు చెందిన గుడియా అనే వికాలంగురాలు భర్తను కోల్పోయి మైనర్‌ కుమార్తెతో కలిసి జీవిస్తోంది. అయితే నెల రోజుల క్రితం గుడియా మైనర్‌ కుమార్తెని ఆమె బంధువు ఒకరు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. దీనితో ఆమె పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె కుమార్తెను వెతికి పెట్టాలంటే డీజిల్‌ ఖర్చు భరించాలని గుడియాకి చెప్పారు పోలీసులు. దీనితో బంధువులు దగ్గర 15 వేల రూపాయలను అప్పుగా తెచ్చి ఇచ్చింది. అయినప్పటికీ ఆ పోలిసుల నుంచి నో రెస్పాన్స్.. ఏమైందని అడిగితే వెతుకుతున్నాం అనే మాట పదే పదే చెబుతున్నారు.

దీనితో విసుగు వచ్చిన గుడియా అధికారులను నిలదీసింది. దీనితో అధికారులు ఆమె పైన ఏ మాత్రం జాలీ లేకుండా ''ఇక్కడ నుంచి వెళ్లు.. అసలు నీ కుమార్తె ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో'' అంటూ నీచంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. స్టేషన్‌ నుంచి ఇద్దరు అధికారులను తొలిగించి ఆమె కంప్లేంట్ పైన యాక్షన్‌ తీసుకోవాల్సిందిగా సూచించారు. అనంతరం పోలీసు వాహనంలో గుడియాని ఆమె ఇంటివద్ద వదిలేశారు. 

Tags:    

Similar News