రైతుల ఉద్యమంపై ట్వీట్ల యుద్ధం.. ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు
అభ్యంతరకరమైన ట్వీట్లను అనుమతించడంపై ట్విటర్‌కు కేంద్రం నోటీసులు పంపించింది.;
రైతుల ఉద్యమంపై సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. దేశ రాజధానిలో జరుగుతున్న ఆందోళనపై విదేశీ సెలబ్రిటీలు నోరెత్తడంపై దేశీయ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కౌంటర్లు వేశారు. రైతుల ఆందోళనకు రిహానా, గ్రెటా థన్‌బర్గ్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
వీరి ట్వీట్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టొద్దని విదేశీ సెలబ్రిటీలను భారత ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటూ మండిపడింది. దేశంలోని చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే సాగుచట్టాలపై అభ్యంతరాలున్నాయని విదేశాంగశాఖ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాదనకు భారత సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.
రైతుల గురించి ఎవరూ మాట్లాడరేం అంటూ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రిహానా ట్వీట్ చేశారు. దీనిపై కంగనా ఘాటైన కౌంటర్ ఇచ్చింది. మాట్లాడడానికి వారు రైతులు కాదు.. ఉగ్రవాదులు అంటూ ట్వీట్ చేసింది. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ సైతం జోక్యం చేసుకున్నారు. పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్ కూడా రైతు ఆందోళనలకు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో భారత్‌లో జరుగుతున్న విషయాలపై ఇతర దేశాల వాళ్లు స్పందించడం ఏంటని సచిన్ టెండూల్కర్ సైతం ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు.
రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు, ప్రముఖులు ట్వీట్లు చేస్తుంటే.. వాటికి ధీటుగా ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్, సినీ ప్రముఖులు కౌంటర్లు ఇచ్చారు. విభేదాలను సృష్టించేవారికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. సమస్య పరిష్కారానికి మద్దతు ఇద్దాం అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. భారత్‌పై దుష్ప్రచారం చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అజయ్ దేవగన్ సూచించారు. భారతీయుల్ని విడదీసే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దని కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో రైతుల ఉద్యమంపై ట్వీట్ల యుద్ధం గరంగరంగా సాగింది.
అసలు ఇలాంటి అభ్యంతరకరమైన ట్వీట్లను అనుమతించడంపై ట్విటర్‌కు కేంద్రం నోటీసులు పంపించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సెలబ్రిటీల ట్వీట్లపై విరుచుకుపడ్డారు. ఇండియా ఎగైనెస్ట్ ప్రొపగాండా, ఇండియా టుగెదర్ హ్యాష్‌ట్యాగ్‌లతో అమిత్ షా ట్వీట్ చేశారు. రైతుల మారణకాండ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న ఖాతాలను, అందులోని విషయాలను తొలగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, ధర్మేంద్ర ప్రదాన్, నిర్మలా సీతారామన్, వీకే సింగ్ కూడా అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.