GOLD: బంగారంపై కొత్త కస్టమ్ రూల్స్
అమల్లోకి 2026 బ్యాగేజీ నిబంధనలు... విదేశీ ప్రయాణికులకు డ్యూటీ ఫ్రీ ఊరట... మహిళలకు 40 గ్రా బంగారం డ్యూటీ ఫ్రీ.. పురుషులకు 20 గ్రా బంగారు ఆభరణాల మినహాయింపు
విదేశాల నుంచి వచ్చే భారతీయులకు మరియు పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. దశాబ్ద కాలంగా ఉన్న పాత నిబంధనలను సవరిస్తూ, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ను ఈనెల 2 నుంచి అమల్లోకి తెచ్చింది. బంగారం ఆభరణాల పరిమితితో పాటు, వ్యక్తిగత వస్తువుల డ్యూటీ ఫ్రీ లిమిట్‌ను పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ ప్రయాణికులకు పెద్ద ఊరటనివ్వనుంది.
పసిడి ఆభరణాలపై కొత్త నిబంధనలు
గతంలో బంగారు ఆభరణాల తెచ్చుకునే పరిమితి నగదు విలువ ప్రాతిపదికన ఉండేది. కానీ ఇప్పుడు దానిని బరువు ప్రాతిపదికన మార్చారు.
మహిళా ప్రయాణికులు: 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి సుంకం లేకుండా తీసుకురావచ్చు. (గతంలో రూ. 1 లక్ష వరకు మాత్రమే).
పురుష ప్రయాణికులు: 20 గ్రాముల వరకు పసిడి ఆభరణాలకు అనుమతి ఉంటుంది. (గతంలో రూ. 50 వేల వరకు మాత్రమే). కనీసం ఏడాది పాటు విదేశాల్లో నివసించిన వారికి మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుంది. ఇది కేవలం ఆభరణాలకు మాత్రమే; బంగారు బిస్కెట్లు, కడ్డీలకు ఎలాంటి మినహాయింపు ఉండదు. విదేశాల నుంచి వచ్చే భారతీయ నివాసితులు మరియు భారత సంతతి పర్యాటకులు తమ వెంట తెచ్చుకునే కొత్త వస్తువుల పరిమితిని రూ. 50,000 నుంచి రూ. 75,000కు పెంచారు. అంటే, రూ. 75 వేల విలువైన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ చెల్లించనక్కర్లేదు. అయితే, రెండేళ్ల లోపు పిల్లలకు ఈ మినహాయింపు ఉండదు.
ల్యాప్‌టాప్‌లు: 18 ఏళ్లు పైబడిన ప్రతి ప్రయాణికుడు తమ వెంట ఒక కొత్త ల్యాప్‌టాప్ లేదా నోట్‌ప్యాడ్‌ను సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు. శాశ్వతంగా భారత్‌కు వస్తుంటే: ఉద్యోగం ముగించుకుని శాశ్వతంగా భారత్‌కు తిరిగి వచ్చే వారికి వారు అక్కడ నివసించిన కాలాన్ని బట్టి భారీ మినహాయింపులు ఇచ్చారు.
3-12 నెలలు ఉన్న వారికి: రూ. 1.50 లక్షల వరకు.
ఏడాది పాటు ఉన్న వారికి: రూ. 3 లక్షల వరకు.
రెండేళ్లకు పైబడి ఉన్న వారికి: గరిష్ఠంగా రూ. 7.50 లక్షల విలువైన వస్తువులపై సుంకం ఉండదు.
మద్యం & సిగరెట్లు: 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్లు, 125 గ్రాముల పొగాకు వరకు మినహాయింపు కొనసాగుతుంది.
బదిలీ కుదరదు: ఒక ప్రయాణికుడికి ఉన్న పరిమితిని ఇంకొకరికి బదిలీ చేయడం లేదా కుటుంబ సభ్యులందరి లిమిట్‌ను కలిపి ఒకే వస్తువుపై వాడటం కుదరదు.
సిబ్బందికి పరిమితి: విమాన లేదా నౌకా సిబ్బంది కేవలం రూ. 2,500 విలువైన చాక్లెట్లు లేదా కాస్మెటిక్స్ మాత్రమే తెచ్చుకోవాలి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకానొక దశలో భారీగా పతనమైన పసిడి, ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1,50,000 వద్ద, కిలో వెండి ధర రూ. 2,48,490 వద్ద కొనసాగుతోంది. ప్రయాణికులు విదేశీ కరెన్సీ విషయంలోనూ 'ఫెమా' నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.