ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని!
ఇంకా 20 ఏళ్ళు కూడా నిండని ఓ యువతి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టనుంది. అయితే ఈ బాధ్యతలు కేవలం ఒక్కరోజు మాత్రమే;
ఇంకా 20 ఏళ్ళు కూడా నిండని ఓ యువతి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టనుంది. అయితే ఈ బాధ్యతలు కేవలం ఒక్కరోజు మాత్రమే. అంటే ఒకేఒక్కడు సినిమాలో హీరో అర్జున్ లాగా అన్నట్టు.. ఎందుకంటే.. రేపు(జనవరి 24) జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కూడా.
ఇంతకి సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరో కాదు.. హరిద్వార్ నివాసి శ్రీతి గోస్వామి.. ఈ యువతి బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ మేరకు సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. దీనితో రేపు ఈమె ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది.
ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో రేపు ఉత్తరాఖండ్ లో నవ పాలన కొనసాగనుంది. కాగా సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. ఈ యువతి తండ్రి ఆమె గ్రామంలో ఒక చిన్న దుకాణం నడుపుతుండగా, తల్లి అంగన్వాడీ కార్మికురాలుగా పనిచేస్తోంది.