Amarinder Singh : బీజేపీలోకి అమరీందర్‌ సింగ్‌.. కీలక పదవి ఆఫర్.. ?

అమరీందర్‌ సింగ్‌కు కేంద్ర క్యాబినెట్‌ పదవి ఖాయమైనట్టేనా? పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ అమరీందర్‌నే అస్త్రంగా వాడుకోబోతోందా?

Update: 2021-09-30 03:41 GMT

అమరీందర్‌ సింగ్‌కు కేంద్ర క్యాబినెట్‌ పదవి ఖాయమైనట్టేనా? పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ అమరీందర్‌నే అస్త్రంగా వాడుకోబోతోందా? నిజానికి కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రం పంజాబ్‌ మాత్రమే. రైతు ఉద్యమం కారణంగా పంజాబ్‌లో కాంగ్రెస్‌కు విపరీతమైన మైలేజీ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపు దాదాపు ఖాయమే. ఇలాంటి పరిస్థితుల్లో అమరీందర్‌సింగ్‌ కాంగ్రెస్‌ను వీడడం, బీజేపీ అగ్రనేతలను కలవడం.. ఆ పార్టీకి పెద్ద దెబ్బే. పైగా బీజేపీ తీసుకొచ్చిన సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించింది మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగే. ఉన్నట్టుండి బీజేపీ నేతలను కలవడం అంటే.. సాగు చట్టాలను ఆహ్వానిస్తున్నట్టే లెక్క. దీంతో తదుపరి రాజకీయం ఎలా మారబోతోందన్నదే ఆసక్తిగా మారింది.

అమరీందర్‌సింగ్‌-బీజేపీ ఎపిసోడ్‌లో మూడు థియరీలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఒకటి.. కెప్టెన్‌ బీజేపీలో చేరడం, కెప్టెన్‌ నాయకత్వంలో పంజాబ్‌లో ఎన్నికలకు వెళ్లడం. రెండోది కెప్టెన్‌ కొత్తగా ప్రాంతీయ పార్టీని పెడితే ఆ పార్టీకి బీజేపీ మద్దతివ్వడం. మూడోది అమరీందర్‌ను బీజేపీలో చేర్చుకుని కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇవ్వడం. ఎలా ఆలోచించినా.. కెప్టెన్‌ను బీజేపీ వైపు తిప్పుకోవడమే కనిపిస్తోంది.

ప్రస్తుతం అమరీందర్‌సింగ్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చి.. వచ్చే ఎన్నికల నాటికి పంజాబ్‌ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా దింపాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రైతు ఉద్యమం వల్ల కలిగిన డ్యామేజీని పోగొట్టుకోవాలంటే అమరీందర్‌ సింగే సరైన వ్యక్తిగా భావిస్తోంది బీజేపీ. పైగా అమరీందర్‌ జాట్‌ సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. పంజాబ్‌లో ఈ సామాజికవర్గం ఓట్లు దాదాపు 18 శాతం వరకు ఉన్నాయి. పంజాబ్‌లో పెద్ద మొత్తం వ్యవసాయ భూములు కలిగి ఉన్న వారు కూడా ఈ సామాజికవర్గం వాళ్లే.

ప్రస్తుతం రైతు ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నది కూడా అమరీందర్‌సింగ్‌ కమ్యూనిటీకి చెందిన వాళ్లే. సో, రేప్పొద్దున రైతు ఉద్యమ నాయకులతో చర్చలంటూ జరిగితే అమరీందర్‌నే ముందు నిలబెట్టాలనేది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. అమరీందర్‌సింగ్‌ హామీ ఇస్తే.. రైతులు ఉద్యమాన్ని విరమిస్తారనేది బీజేపీ ఆశ. అందుకే, వీలైనంత త్వరగా అమరీందర్‌ సింగ్‌ సేవలను ఉపయోగించుకోవాలనుకుంటోంది బీజేపీ. 

Tags:    

Similar News