TRUMP: ట్రంప్ టారిఫ్‌లు రద్దు: ఆ రూ.12 లక్షల కోట్ల మాటేంటి?

అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్‌లపై కీలక తీర్పు... కోర్టు తీర్పుతో ట్రంప్ అదనపు సుంకాలు చెల్లవు.. ‘అమెరికా ఫస్ట్’ టారిఫ్‌లకు న్యాయస్థానంలో షాక్

Update: 2026-02-21 15:00 GMT

అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారత్ సహా పలు ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన అదనపు సుంకాలు (టారిఫ్‌లు) చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుతో ఒక చిక్కుముడి వీడినా, వసూలు చేసిన భారీ సొమ్ము రీఫండ్ విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది.

ఖజానాలో రూ.12 లక్షల కోట్లు.. ఎవరికి దక్కుతాయి?

గతేడాది ఏప్రిల్ 2న ట్రంప్ అధికారంలోకి రాగానే 'అమెరికా ఫస్ట్' నినాదంతో ప్రతీకార సుంకాలు విధించారు. నాటి నుంచి డిసెంబరు మధ్య వరకు అమెరికా కస్టమ్స్ విభాగం సుమారు 13,300 కోట్ల డాలర్లు (సుమారు రూ.12 లక్షల కోట్లు) వసూలు చేసినట్లు అంచనా. ఇప్పుడు ఈ భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కాస్ట్‌కో, రెవ్లాన్, బంబుల్ బీ ఫుడ్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే రిఫండ్‌ల కోసం దిగువ కోర్టులను ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆ డబ్బు ఎవరికి చెందుతుందనేదే అసలు ప్రశ్న. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు నేరుగా నగదు రూపంలో లబ్ధి చేకూరదు. దీనికి ప్రధాన కారణం..

దిగుమతిదారులే చెల్లింపుదారులు: టారిఫ్‌లను భారత్‌లోని కంపెనీలు కాకుండా, అమెరికాలోని దిగుమతిదారులు చెల్లించారు. కాబట్టి రిఫండ్ వస్తే అది అమెరికన్ కంపెనీలకే వెళ్తుంది.

గత ఏడాది కాలంగా అదనపు సుంకాల వల్ల భారతీయ కంపెనీలు కోల్పోయిన మార్కెట్ వాటాకు లేదా తగ్గిన లాభాలకు అమెరికా ఎలాంటి పరిహారం చెల్లించదు.

టారిఫ్‌ల రద్దుతో అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. దీనివల్ల మన టెక్స్‌టైల్స్, స్టీల్, ఫార్మా ఉత్పత్తులకు మళ్లీ పాత గిరాకీ పెరిగే అవకాశం ఉంది. అలాగే, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తూ ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునే భారతీయ కంపెనీలకు కొంతమేర ఊరట లభిస్తుంది.అమెరికాలో రిఫండ్‌ల కోసం ఆటోమేటిక్ వ్యవస్థ లేదు. ప్రతి కంపెనీ విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఈ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించడానికి 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1990ల్లో 'హార్బర్ మెయింటెనెన్స్ ఫీజు' విషయంలో కూడా ఇలాంటి రిఫండ్‌లు జరిగిన చరిత్ర ఉన్నప్పటికీ, ఇంత భారీ స్థాయిలో (రూ.12 లక్షల కోట్లు) రీఫండ్ చేయడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చు.ఈ తీర్పు నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడానికి భారత్‌కు ఒక గొప్ప అవకాశం లభించిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా నిలవడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఇతర దేశాలతో అమెరికా జరిపే వాణిజ్య చర్చల్లో ఆ దేశం తన పట్టు కోల్పోయేలా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం మరియు టెక్స్‌టైల్ రంగాల్లోని భారతీయ ఎగుమతిదారులకు ఈ టారిఫ్‌ల రద్దు ఒక ‘సంజీవని’లా మారి, అమెరికా మార్కెట్‌లో మన వస్తువుల పోటీతత్వాన్ని మళ్ళీ పెంచుతుంది.

Tags:    

Similar News