IIT Bombay: విద్యార్ధి ఆత్మహత్య... 18ఏళ్లకే...
ఐఐటీ బాంబేలో హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య; వ్యవస్థీకృత హత్య అంటూ విద్యార్థుల ధర్నా
ఐఐటీ బోంబేలో విద్యార్ధి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. పోవై క్యాంపస్ కు చెందిన 18ఏళ్ల విద్యార్ధి ఏడు అంతస్థుల హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించకపోవడంతో ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఓవైపు దర్యప్తు కొనసాగుతుండగా, మరోవైపు విద్యార్ధులు మాత్రం ఇది క్యాంపస్ లో కుల వివక్ష కారణంగా చోటుచేసుకున్న హత్య అంటూ ఆరోపిస్తున్నారు. అహ్మదాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్ధి దర్శన్ సోలంకి మూడు నెలల క్రితం క్యాంపస్ లో జాయిన్ అయ్యాడని పోలీసులు తెలిపారు. గత శనివారం తొలి సెమిస్టర్ పరీక్షలు కూడా రాశాడని, ఇంతలోనే ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడనే అంశంపై దర్యప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యా పరంగా ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడా అన్నది వాకబు చేస్తున్నారు. మరోవైపు ఇది కేవలం వ్యవస్థీకృత హత్యేనంటూ విద్యార్ధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.