72వ గణతంత్ర వేడుకలకు రాజ్‌పథ్‌ సిద్ధం.. భద్రతా వలయంలో దేశ రాజధాని

ఏటా రిపబ్లిక్‌డే వేడుకలకు లక్ష మందికి పైగా హాజరయ్యేవారు.. అయితే, కరోనా నిబంధనల కారణంగా ఈసారి 25వేల మందికే అనుమతిచ్చారు.

Update: 2021-01-26 01:06 GMT

72వ గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలోని రాజ్‌పథ్‌ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు.. రిపబ్లిక్‌ డే వేడుకల కోసం 6వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు వింటేజ్‌ పాయింట్లలో ఫేషియల్‌ రికగ్నేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

రాజ్‌ఘాట్‌ వద్ద పీపీఈ కిట్లు, మాస్క్‌, ఫేష్‌ షీల్డ్‌లతో సిబ్బందిని మోహరించారు. రాజ్‌పథ్‌ నుంచి కవాతు జరిగే దాదాపు 8 కిలోమీటర్ల మార్గంలో నిఘా కట్టుదిట్టం చేశారు.. షార్ప్‌షూటర్లు, స్నీపర్స్‌ గస్తీ కాస్తున్నారు. ఢిల్లీతోపాటు.. సరిహద్దు ప్రాంతాల వద్ద ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

ఏటా రిపబ్లిక్‌డే వేడుకలకు లక్ష మందికి పైగా హాజరయ్యేవారు.. అయితే, కరోనా నిబంధనల కారణంగా ఈసారి 25వేల మందికే అనుమతిచ్చారు.ఎర్రకోట వరకు జరగాల్సిన పరేడ్‌ కూడా నేషనల్‌ స్టేడియం వరకే నిర్వహించనున్నారు. ఎర్రకోట వద్ద కేవలం శకటాలకు మాత్రమే అనుమతించనున్నారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ జరిగే ప్రదేశంలో 140 సీసీటీవీ కెమెరాలను అమర్చారు.

రాజ్‌పథ్‌లోకి సామాన్య పౌరులు ప్రవేశించే పాయింట్ల వద్ద 30 చోట్ల ఫేషియల్‌ రికగ్నేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలో దాదాపు 50వేల మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులు, నేరస్థులు, సంఘవిద్రోహక శక్తులకు సంబంధించిన డేటాబేస్‌ ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News