India's Covid Panel Chief: చైనా పరిస్థితి వేరు.. మన పరిస్థితి వేరు.. : భారత కోవిడ్ ప్యానల్ చీఫ్

India's Covid Panel Chief: చైనాలో కరోనా విజృంభించేందుకు 4 వేరియంట్లు కారణమంటున్నారు భారత కొవిడ్‌ ప్యానల్‌ చీఫ్‌ ఎన్‌కే అరోడా. చైనా పరిస్థితి చూసి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన.

Update: 2022-12-28 05:37 GMT

India's Covid Panel Chief: చైనాలో కరోనా విజృంభించేందుకు 4 వేరియంట్లు కారణమంటున్నారు భారత కొవిడ్‌ ప్యానల్‌ చీఫ్‌ ఎన్‌కే అరోడా. చైనా పరిస్థితి చూసి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. చైనా నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.



చైనాలో కరోనా విస్పోటానికి... అనేక రకాల వేరియంట్లే కారణమని తెలిపారు. బీఎఫ్.7 వేరియంట్‌ కేసులు కేవలం 15శాతమేనన్నారు. ఇక బీఎన్‌, బీక్యూ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తుండగా.. ఎస్‌వీవీ వేరియంట్‌ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించారు. దీంతో చైనాలో అనేకమందిలో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.


ఇక.. భారత ప్రజల్లోని హైబ్రీడ్‌ ఇమ్యూనిటీ కారణంగా భయపడాల్సిన పనిలేదన్నారు ఎస్‌కే ఆరోడా. ఇది వ్యాక్సిన్ల్‌ ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, కొవిడ్‌ తొలి, ద్వితీయ, తృతీయ వేవ్‌ల కారణంగా లభించిందన్నారు. ఇక చైనా వాళ్లకు ఇది కొత్త కావడం, వారు ఇంతకు ముందు ఇన్ఫెక్షన్‌ బారిన పడకపోవడంతో పాటు వారు తీసుకొన్న వ్యాక్సిన్లు సైతం తక్కువ ప్రభావవంతమైనవన్నారు.



అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. చైనాతో పోలిస్తే భారత్‌లో 97 శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారని, అందువల్ల భయపడాల్సిన పనిలేదని అన్నారు. కానీ జాగ్రత్తగా ఉండడం, మాస్కులు ధరించడం తప్పని సరి అని తెలిపారు. 

Tags:    

Similar News