ఇది శాస్త్రవేత్తల సమష్టి విజయం: ఇస్రో ఛైర్మన్ శివన్
ఇస్రో ఘనతను నిలబెడుతున్న పీఎస్‌ఎల్వీ.. మరోసారి అదే చరిత్రను రిపీట్ చేసింది. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన PSLV-సీ51 ప్రయోగం విజయవంతమైంది.;
ఇస్రో ఘనతను నిలబెడుతున్న పీఎస్‌ఎల్వీ.. మరోసారి అదే చరిత్రను రిపీట్ చేసింది. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన PSLV-సీ51 ప్రయోగం విజయవంతమైంది. 19 ఉపగ్రహాలను మోసుకెళ్లిన PSLV రాకెట్.. నిర్ణీత కక్ష్యలో వాటిని ప్రవేశపెట్టింది. దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్లింది.
ఈ 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1 ప్రధాన ఉపగ్రహం అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించిన సతీశ్ ధావన్ శాట్ కూడా ఉంది. దీని టాప్ ప్యానల్‌పై ప్రధాని మోదీ చిత్రాన్ని ముద్రించారు. ఎస్డీ కార్డులో నిక్షిప్తం చేసిన భగవద్గీతను కూడా అంతరిక్షంలోకి పంపారు.PSLV-సీ51 విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగితేలారు. ఇది శాస్త్రవేత్తల సమష్టి విజయం అని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.
బ్రెజిల్ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు. పీఎస్‌ఎల్‌వీ-సి51 వాహకనౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజొనియా-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇది 78వ ప్రయోగం కాగా.. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగం. ఉపగ్రహాలను నింగిలోకి పంపాలనుకున్న సంస్థలకు PSLV అత్యంత నమ్మకమైన వాహక నౌక. PSLV రాకెట్ సక్సెస్ రేటు దాదాపు 95శాతం. ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగం కాగా... మొదటి ప్రయోగ వేదిక నుంచి 39వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ వర్షన్‌లో మూడోది.
50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో. భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన సతీశ్ ధావన్, యూని-టీశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం ఇదే. ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో నిర్వహించారు. భారతీయ ఉపగ్రహాల్లో సతీశ్ ధావన్‌ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా, యూని-టీశాట్‌ను శ్రీపెరంబుదూర్‌కు చెందిన జిట్‌శాట్, GHRCE-శాట్.... శ్రీశక్తి శాట్‌లను నాగ్‌పూర్, కోయంబత్తూరు కళాశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించారు.