జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ పరిపాలనను ప్రశ్నించారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. ఒక సాధారణ వ్యక్తి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చానని చెప్పగానే ఎలా నమ్మేసారని అన్నారు. "ఇది చాలా తీవ్రమైన విషయం. జమ్ము కాశ్మీర్ సున్నితమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో లోపం ఎలా జరిగింది. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనకు చాలా ఇబ్బందికర విషయం. కిరణ్ పటేల్ కు సౌకర్యాలు కల్పించే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉండాలి. అక్రమార్కులకు భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి" అని ఫరూక్ అన్నారు.
గుజరాత్ కు చెందిన కిరణ్ పటేల్ తాను PMO అధికారినని కేంద్రంలో అదనపు సెక్రటరీగా పనిచేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులను, స్థానికులను నమ్మించాడు. దక్షిణ కశ్మీర్ లోని యాపిల్ తోటల కొనుగోలుదారులను గుర్తించడానికి ప్రభుత్వం తనను నియమించినట్లు పేర్కొన్నాడు. అతని మాటలు నమ్మిన అధికారులు జమ్ము కశ్మీర్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆతిథ్యంతో పాటు, భద్రతను ఇచ్చారు. వీఐపీ పర్యటనల సమాచారం లేకపోవడంతో సీఐడీ అధికారులు అనుమానించి విచారించగా కిరణ్ నిజాన్ని ఒప్పుకున్నాడు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.