J&K Terror Attack: రాజౌరీలో మరో పేలుడు; చిన్నారి మృతి
రాజౌరీలో కొనసాగుతున్న ఉగ్ర కలకలం; ఓ ఇంటి వద్ద పేలుడు; ఓ చిన్నారి మృతి; కొన ఊపిరితో కొట్టుమిడ్డాడుతున్న మరో చిన్నారి;
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో ఇళ్లలోకి జొరబడి కాల్పులు జరిపిన ఘటన ఇంకా సద్దుమణగక ముందే అదే ప్రాంతంలో జరిగిన మరో పేలుడు ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో మరో చిన్నారి పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలుస్తోంది.
డంగ్రీ గ్రామంలోనే ఈరోజు ఉదయం ఈ పేలుడు చోటుచేసుకోగా క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం దాడులకు పాల్పడ్డ ఓ టెర్రరిస్టు గ్రామంలోనే ఉన్నాడు అన్న సమచారం అందడంతో సైనికులు అతడి కోసం ఇంటింటినీ జల్లెడ పడుతున్నారు.
మరోవైపు గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలోకి చొరబడిన తీవ్రవాదుల కోసం మరో బృందం గాలిస్తోంది. ఉగ్రదాడికి నిరసనగా జిల్లా వాసులు స్వీయ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక భద్రతాదళంతో పాటూ సీఆర్పీఎఫ్ దళాలు సైతం రంగంలోకి దిగాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు స్నిఫర్ డాగ్ లను కూడా గాలింపు చర్యలకు ఉపయోగిస్తున్నామని తెలిపారు.