ఎన్నికల ప్రచారంలో పదే పదే ఎంజీఆర్ పేరు ప్రస్తావిస్తున్న కమల్..!
ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కమల్ హాసన్. ఇవాళ రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎంజీఆర్ పోటీ చేసిన అలందూర్ నుంచి హైవోల్టేజ్ క్యాంపైనింగ్‌కు శ్రీకారం చుట్టారు.;
ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కమల్ హాసన్. ఇవాళ రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎంజీఆర్ పోటీ చేసిన అలందూర్ నుంచి హైవోల్టేజ్ క్యాంపైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. తమిళుల ఆరాద్యదైవం ఎంజీఆర్ అన్నా డీఎంకే పార్టీని స్థాపించింది కూడా అలందూర్‌లోనే. కమల్‌హాసన్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ఎంజీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ మార్పునకు నాంది పలికారని, తాను కూడా అదే మార్పును సృష్టిస్తానని చెప్పుకొచ్చారు. ఎంజీఆర్ ఆశయాలను కొనసాగిస్తానని స్పీచ్‌లో అదరగొడుతున్నారు.
తమిళనాడులో ముందుగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది కమల్ హాసనే. ఇప్పటికే 27 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి.. అప్పుడే సెకండ్ ఫేజ్ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించారు. కమల్ హాసన్ దూకుడు చూసి కాంగ్రెస్ పార్టీ పొత్తుకు రెడీ అయింది. ఇప్పటికే, డీఎంకేకు మిత్రపక్షంగా ఉంది. ఈ సమయంలో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యంను కలుపుకుంటే బాగుంటుందన్న ఆలోచన చేసింది. అయితే, ఈ పొత్తును అటు డీఎంకే, ఇటు మక్కల్ నీది మయ్యం తోసి పుచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం 36 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాని, కేవలం 18 సీట్లు మాత్రమే ఇస్తామంటూ డీఎంకే ఆఫర్ చేస్తోంది. ఒకవేళ డీఎంకే గనక తగ్గకపోతే.. కాంగ్రెస్ పార్టీ కమల్ హాసన్ వైపు నడిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు కమల్ హాసన్. ఇప్పటికే హీరో శరత్‌కుమార్ పార్టీ ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీతో కలిసి బరిలో దిగుతున్నారు. థర్డ్ ఫ్రంట్ సీఎం అభ్యర్ధి కమల్‌హాసనే అని శరత్‌కుమార్ చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు కమల్. మరోవైపు కోలీవుడ్‌లోని పలువురు బడా హీరోలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు కమల్ హాసన్ వ్యూహరచన చేశారు. ప్రచారంలో భాగంగా యువత, మహిళలే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. ఐదు లక్షల ఉద్యోగాలు, 50 శాతం రిజర్వేషన్లు, గృహిణులకు జీతం, ఒంటరి తల్లులకు ఆర్థిక సాయం, ఏ దిక్కూ లేని మహిళలకు ఉచిత షెల్టర్ వంటి హామీలు గుప్పించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని, ప్రధాని మోదీని ఏకేశారు కమల్ హాసన్. రెండు ముక్కలు తమిళంలో మాట్లాడి, తమిళ పద్యాలు చెప్పినంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారనుకోవడం అవివేకం అన్నారు. ఆ రోజులు ఎప్పుడో పోయాయని గట్టిగానే సమాధానం ఇచ్చారు. తమిళ భాష, తమిళ సంస్కృతి అమ్మకానికి సిద్ధంగా లేవని చెప్పుకొచ్చారు. నీట్, హిందీని ఎలా రుద్దుతున్నారో తమిళులందరికీ తెలుసని కామెంట్ చేశారు. మరోవైపు అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుపైనా విమర్శలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.