కర్నాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్య!
కర్నాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన ఈ ఉదయం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు.;
కర్నాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన ఈ ఉదయం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ధర్మెగౌడ మృతదేహాన్ని కనుగొన్నారు. ఘటనాస్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు.
ధర్మెగౌడ నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గన్‌మెన్, పోలీసులు ఆయన కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆయన ఫోన్ కూడా స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆయన ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పలుచోట్ల వెదికిన తర్వాత చివరకు గుణసాగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
డిసెంబర్ 15న కర్నాటక విధాన పరిషత్ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఛైర్మన్ ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వాగ్వాదాలకు దిగారు. శాసన పరిషత్ ఛైర్మన్ స్థానాన్ని అవమానించే రీతిలో సభ్యులు ప్రవర్తించారు. మాటల దాడులతో పాటు ఒకరినొకరు తోసివేసుకున్నారు.
సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను ఛైర్మన్ సీటు నుంచి సభ్యులు తోసేశారు. మండలిలో ఘటనతో డిప్యూటీ ఛైర్మన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనే ఆత్యహత్యకు కారణమా, మరేదైనా వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.