Karnataka High Court : హిజాబ్ తీర్పు ... బెంగళూరులో హై అలర్ట్
Karnataka High Court : హిజాబ్ వివాదంపై కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది కర్నాటక హైకోర్టు. కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం.. హిజాబ్ వివాదంపై నెల రోజులు సుదీర్ఘంగా విచారించింది.;
Karnataka High Court : హిజాబ్ వివాదంపై కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది కర్నాటక హైకోర్టు. కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం.. హిజాబ్ వివాదంపై నెల రోజులు సుదీర్ఘంగా విచారించింది. హిజాబ్ కేసులో 11 రోజులపాటు వరుసగా విచారణ చేపట్టిన కర్నాటక హైకోర్టు.. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. హిజాబ్ తీర్పు నేపథ్యంలో కర్నాటకవ్యాప్తంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కర్నాటక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
హిజాబ్ తీర్పు నేపథ్యంలో బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు బెంగళూరులో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కలెక్టర్ ప్రకటించారు. వారం పాటు బెంగళూరులో ఎలాంటి సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని, జనం గుమిగూడడాన్ని కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. దక్షిణ కన్నడలోని అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కర్నాటకవ్యాప్తంగా ఇవాళ జరిగే పరీక్షలను వాయిదా వేసుకోవాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. శివమొగ్గలోనూ 8 బెటాలియన్ల కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీసులు, 6 జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను మోహరించారు. కబురగి, దావణగెరె, బెల్గాం, కొప్పల్, గడగ్, హాసన్ జిల్లాల్లో కూడా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.
ఈ ఏడాది జనవరి 1న కర్నాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైంది. మంగళూరు జిల్లా ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో.. హిజాబ్‌తో వచ్చిన ఆరుగురు విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం క్లాసులకు అనుమతించలేదు. దీంతో వివాదం రాజుకుంది. హిజాబ్ ధరించడం అనేది కాలేజీ యూనిఫాం నియమాలకు విరుద్ధమని కాలేజీ యాజమాన్యం వాదించింది. దీనిపై కర్నాటకవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులకు పోటీగా.. హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు, జెండాలు ఊపుతూ కాలేజీలు, స్కూల్స్ క్యాంపస్‌లలో హల్ చల్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించినట్లయితే వారి మతపరమైన దుస్తులు, చిహ్నాలను ప్రదర్శించడానికి కూడా అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. చివరికి ఈ వివాదం కోర్టుకు చేరింది.
దుపట్టాలు, గాజులు, తలపాగాలు, శిలువలు, బొట్టు వంటి వందలాది మతపరమైన చిహ్నాలు ఉన్నప్పుడు.. కేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారని పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవి వర్మ కుమార్ ప్రశ్నించారు. గాజులు ధరించినవారు, బొట్టు పెట్టుకున్న వాళ్లు, శిలువ వేసుకున్న వారిని కాకుండా కేవలం ముస్లిం అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకున్నారని కోర్టులో వాదించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని వాదించారు. దీనిపై కాసేపట్లో తుది తీర్పు రానుంది.