KCR Meets Stalin: ఎమ్‌కే స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్.. పలు కీలక అంశాలపై చర్చ..
KCR Meets Stalin: తమిళనాడు పర్యటనలో భాగంగా కేసీఆర్ రెండో రోజు ఆరాష్ట్ర సీఎం ఎంకె స్టాలిన్‌తో భేటీ అయ్యారు.;
KCR Meets Stalin (tv5news.in)
KCR Meets Stalin: తమిళనాడు పర్యటనలో భాగంగా కేసీఆర్ రెండో రోజు ఆరాష్ట్ర సీఎం, డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో దాదాపు గంటపాటు ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఈ భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, ఇరు రాష్ట్రాల పాలనా వ్యవహారాలపై ఇద్దరు సీఎంలు చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే యాదాద్రి వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
అంతకుముందు చెన్నైలో తాను బసచేసిన హోటల్ నుంచి అశ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కేసీఆర్‌కు శాలువా కప్పి తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించారు స్టాలిన్. అనంతరం ఇరు కుటుంబాల పరస్పర పరిచయం జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్‌కు కేసీఆర్ మెమెంటో అందజేశారు. కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఉన్నారు.
సోమవారం నాడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్... తొలిరోజు శ్రీరంగంలోని రంగనాథస్వామిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామికి మొక్కులు సమర్పించారు. అనంతరం చెన్నై చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. రెండో రోజు తిరుత్తణిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సాయంత్రం స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
హుజురాబాద్ ఫలితం తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్... ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై గుర్రుగా ఉన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయడంతో పాటు ఢిల్లీకి సైతం వెళ్లారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటున్న కేసీఆర్... ఆ దిశగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా స్టాలిన్‌తో భేటీ అయ్యారని, ఈ టూర్ ఫలితం బేరీజు వేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్ వేగంగా అడుగులు వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.