తెగ పాపులర్ అవుతున్న కూ యాప్!
కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ వంటి వారు ఇప్పటికే కూ..లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చేరిపోయింది.;
ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో డెవలపర్లు దేశీయంగా కొత్త రకం యాప్‌లను అభివృద్ధి చేస్తున్నారు. విదేశీ సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫాంలకు పోటీగా వీటిల్లో కొన్నింటికి ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే వాట్సాప్‌కు పోటీగా సందేశ్ అనే కొత్త యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీన్ని కొంతమంది అధికారులు పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ అనే కొత్త యాప్‌ను మన దేశంలో లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ ఇండియన్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌ను పలువురు ప్రముఖులు కూడా వాడుతున్నారు.
కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ వంటి వారు ఇప్పటికే కూ..లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చేరిపోయింది. ఆమె కూ.. లో అకౌంట్ ఓపెన్ చేసింది. అంతేకాకుండా ఈ సందర్భంగా ట్విట్టర్‌కి కూడా చురక అంటించింది. " ట్విట్టర్ నీ టైమ్ అయిపోయింది. కూ యాప్‌కు హాయ్ చెప్పే టైం వచ్చిందని.. త్వరలోనే అకౌంట్ వివరాలు వెల్లడిస్తానని.. దేశీయంగా అభివృద్ది చెందిన యాప్ ఓపెన్ చేసినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందంటూ ట్వీట్ చేసింది.
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌లో కూ..ను అభివృద్ధి చేశారు. ఈ ఇండియన్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌ను 2020 మార్చిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కా అనే ఇద్దరు వ్యక్తులు దీని సృష్టికర్తలు. ట్విట్టర్‌లో ఉన్న అన్ని ఫీచర్లూ దీంట్లో కూడా ఉన్నాయి. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాంలో వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవచ్చు. 2020 ఆగస్టులో భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను కూడా గెల్చుకుంది.
ఈ యాప్ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. కూ..లో హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ భాషల్లో పోస్టులు రాయవచ్చు. కూ వినియోగదారులు పోస్ట్‌లు, ఆడియో, వీడియో, ఫోటోలను షేర్ చేయవచ్చు. వివిధ రకాల పోల్స్ కూడా నిర్వహించవచ్చు. DMల ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు.
కూ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైస్‌లలో దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్లో 4.7 స్టార్ రేటింగ్ ఉంది. iOS యాప్ స్టోర్‌లో 4.1 రేటింగ్ పొందింది. 49వేల 400 రివ్యూలతో, పది లక్షలకు పైగా డౌన్లోడ్‌లతో కూ యాప్ దూసుకుపోతోంది. మొత్తంగా వాట్సాప్, ట్విట్టర్ వంటి విదేశీ నెట్‌వర్క్‌లకు బదులుగా మన దేశంలోనే రూపొందిన ఇలాంటి కొత్త యాప్‌లను వాడటం మంచిదని చాలామంది యూజర్లు భావిస్తున్నారు.