త్వరలో కర్ణాటకలో లాక్‌డౌన్?
దీనితో లాక్‌డౌన్ విధించడమే కరెక్ట్ అని భావిస్తున్నారు సీఎం యడియూరప్ప. అయితే, బెళగావి, మస్కి, బసవ కల్యాణ నియోజకవర్గాల్లో ఈనెల 17న ఉప ఎన్నికలు ఉన్నాయి.;
కరోనా అదుపులోకి రాకపోతే మరో వారంలో లాక్‌డౌన్ తప్పదని ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం. ప్రస్తుతం ఒక్క బెంగళూరు నగరంలోనే రోజుకు ఆరు వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. మరో నెల రోజుల్లో ఒక్క బెంగళూరులోనే రోజుకు 15 వేల నుంచి 18వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్యశాఖ నివేదిక ఇచ్చింది. రాష్ట్రం మొత్తం మీద రోజుకు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.
దీనితో లాక్‌డౌన్ విధించడమే కరెక్ట్ అని భావిస్తున్నారు సీఎం యడియూరప్ప. అయితే, బెళగావి, మస్కి, బసవ కల్యాణ నియోజకవర్గాల్లో ఈనెల 17న ఉప ఎన్నికలు ఉన్నాయి. అవి ముగిసిన తరువాత 18 లేదా 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వచ్చే అభిప్రాయాలను బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారు. దాదాపుగా 20వ తేదీ నుంచి కర్నాటకలో లాక్‌డౌన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్నాటకలో కనీసం పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ఉన్నారు సీఎం యడియూరప్ప. ప్రస్తుతం కర్నాటకలో 70వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజూ పదివేల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న వారే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. పైగా ఉగాది, ఇతర పండగలు ఉన్న కారణంగా పట్టణాల నుంచి గ్రామాలకు ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారని, కరోనా మరింత వ్యాప్తి చెందవచ్చన్న భయాలున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పెడితేనే కరోనాను కంట్రోల్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కర్నాటకలోని ఏడు జిల్లాల్లో రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.