మరోసారి లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర..!
మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.;
మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 40వేల 414 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27లక్షల 13వేల 875కు, మరణాల సంఖ్య 54వేల 181కు చేరింది. అలాగే ముంబైలో ఆదివారం రికార్డుస్థాయిలో 6వేల 923 కరోనా కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.
మరోవైపు వైరస్ కట్టడికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని.. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. రాష్ట్రంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే, సీఎస్, కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ వైద్యులు, ఇతర అధికారులతో సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న అధికారులు, కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ వైద్యులు.. తాజాగా కరోనా కేసులు పెరుగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కరోనా మరణాలు కూడా పెరుగుతాయన్నారు.
ఇక కరోనా కేసులు ఇలాగే పెరిగిపోతే రాష్ట్రం మౌలిక వసతుల లేమితో ఆరోగ్య పరిరక్షణ సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యాల సరఫరా, మందులు, అత్యవసర సేవలు, వైద్య సౌకర్యాలపై ప్రాణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వ యంత్రాంగం మధ్య ఎటువంటి సమన్వయలోపం లేకుండా చూడాలని అధికారులకు ఉద్ధవ్ ఠాక్రే దిశానిర్దేశం చేశారు.
ఇప్పటికే మహారాష్ట్రలో వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు షాపులు మూసే ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి. అయితే అత్యవసర సేవలను ఇందులోనుంచి మినహాయించారు. మరోవైపు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా తిరిగితే 500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే 1000, కర్ఫూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడితే 1000 జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 15వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.