ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం మమతా బెనర్జీ..!
ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా పోటాపోటీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. మమత దూకుడు మరింతగా పెంచారు.;
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సీఎం మమత బెనర్జీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా పోటాపోటీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. మమత దూకుడు మరింతగా పెంచారు. టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సువేందు అధికారితో తలపడబోతున్న మమత... ఇవాళ నందిగ్రామ్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక నందిగ్రామ్‌లో నిర్వహించిన ర్యాలీలో దీదీ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలతో కలిసి ఆమె ర్యాలీ నిర్వహించారు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తాను నామినేషన్ వేయొద్దని మీరు కోరుకుంటే నామినేషన్ దాఖలు చేయబోనని ప్రజలను ఉద్దేశించి మమత చెప్పారు.. కానీ, తనను మీ అమ్మాయిగా భావిస్తేనే నామినేషన్ వేస్తానని చెప్పారు.
అటు బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొడుతూ కౌంటర్లతో విరుచుకుపడుతున్న మమతా బెనర్జీ తాను హిందూ బిడ్డనంటూ గట్టిగానే చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఆమె.. చండీపాఠంలోని మంత్రాలను పఠించారు.. తాను ప్రతి రోజూ ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి ముందు తప్పనిసరిగా చండీపాఠం చదువుతానని చెప్పారు. తనతో హిందుత్వ రాజకీయాలు చేయవద్దంటూ బీజేపీని హెచ్చరించారు. అంతేకాదు.. దీదీ సర్కారు ముస్లింలను సంతృప్తిపరచే రాజకీయాలు చేస్తోందంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను దేవాలయాల సందర్శనతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చండీ ఆలయం, పారుల్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గంట మోగిస్తూ, మంత్రాలు పఠించారు.
ఇక ప్రచారంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మమతా బెనర్జీ.. ఓ హోటల్‌లో టీ కాచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. టీ కాచి.. దానిని స్థానికులకు అందించారు దీదీ. ప్రచారంలోనే కాదు.. హామీల విషయంలోనూ తృణమూల్ కాంగ్రెస్ ముందే ఉంది.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసింది. రేపు మహాశివరాత్రి రోజున మమత బెనర్జీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నందిగ్రామ్‌లో శివరాత్రి పూజల్లో మమత పాల్గొన్న అనంతరం కోల్‌కతా చేరుకుని కాళీఘాట్‌లో మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలుస్తోంది.