భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు.. చిరుతపై విరుచుకుపడిన వ్యక్తి
కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చిరుతతో పోరాడి దాన్ని హతమార్చాడు.;
కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చిరుతతో పోరాడి దాన్ని హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. హాసన జిల్లా అరసికెరె తాలూకా బైరగొండనహళ్లిలో జరిగింది. భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న రాజగోపాల్ నాయక్‌పై ఒక చిరుతపులి దాడి చేసింది. దీంతో ముగ్గురూ ఒక్కసారిగా కింద పడ్డారు. ఈ క్రమంలో రాజగోపాల్ భార్య, కూతురు మీదకు చిరుత దాడిచేసే ప్రయత్నం చేసింది. అప్రమత్తమైన రాజగోపాల్ పులిపై విరుచుకుపడ్డాడు. చిరుత చేస్తున్న గాయాలతో ఒకవైపు శరీరం నుంచి రక్తమోడుతున్నా పోరాటాన్ని మాత్రం ఆపలేదు.
ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు కోల్పోవడం ఖాయమని భావించిన రాజగోపాల్ చిరుతతో తలపడ్డాడు. చేతికి అందిన కర్రతో చితకబాదాడు. చిరుత ఎదురుదాడి చేసి తీవ్రంగా గాయపరిచినా వెనుకంజ వేయలేదు. చివరకు చిరుతను హతమార్చడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే చిరుత సోమవారం ఇద్దరిపై దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు.