Modi Tour: ఇక మోదీతో యుద్ధమే: వామపక్షాలు

Modi Tour: ఈ నెల 12న మోదీ తెలంగాణ టూర్‌పై రాజకీయ రగడ నెలకొంది. ఇక మోదీతో యుద్ధమే అని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.;

Update: 2022-11-10 07:23 GMT

Modi Tour in Telangana: ఈ నెల 12న మోదీ తెలంగాణ టూర్‌పై రాజకీయ రగడ నెలకొంది. ఇక మోదీతో యుద్ధమే అని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని పర్యటనను అడ్డుకుని తీరుతామని గులాబీ శ్రేణులతో పాటు లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ విద్యార్ధి, కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ రామగుండం పర్యటన వివాదాస్పదం అవుతుంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రధాని మోదీని అడ్డుకుని తీరుతామని తాజాగా జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు కూడా స్పష్టం చేశారు.


సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఏడాది క్రితమే ఉత్పత్తిని ప్రారంభించిందని, దాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు.

మరోవైపు, ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కూడా హెచ్చరించింది. యూనివర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే మోదీ పర్యటన అగ్నిగుండం అవుతుందన్నారు.


ఈ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకు గత సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీలోఆమోదం తెలిపారు. దానికి గవర్నర్‌ ఆమోదించకపోవడంపై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోంది. ఇతర రాష్ట్రాలకు ఒకలా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని జేఏసీ నాయకులు ఆరోపణలు చేశారు.

ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ రెచ్చగొడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.


ఇక ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తుండగా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కేంద్ర బలగాలు, పీఎమ్ సెక్యూరిటీ కమోండోలు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి. మొత్తానికి మోదీని టార్గెట్‌ చేసుకుని టీఆర్ఎస్ వార్ మొదలు పెట్టిన నేపథ్యంలో ప్రధాని రామగుండం పర్యటన ఉద్రిక్తతల నడుమ కొనసాగే అవకాశం ఉంది.

Tags:    

Similar News