Cobra in Courier Box: ద్యావుడా.. కొరియర్ బాక్సులోకి కోబ్రా ఎలా వచ్చిందో..

Cobra in Courier Box:

Update: 2021-11-17 11:30 GMT

Cobra in Courier Box: కొరియర్ బాక్సులో కోరి తెప్పించుకున్న వస్తువులు వస్తాయనుకుంటే అందులో ఉన్న కోబ్రా (నాగుపాము) ని చూసి గుండె గుభేల్‌మంది కుటుంబసభ్యులకి. ఈ షాకింగ్ సంఘటన నాగపూర్‌లో జరిగింది. కొరియర్ బాక్స్‌లో నుండి ఇతర వస్తువులతో పాటు నాగుపాము కనిపించింది. నాగపూర్ జ్ఞానేశ్వర్ నగర్‌లో నివసిస్తున్న సునీల్ లఖేటే కుటుంబంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒక ప్రముఖ కొరియర్ కంపెనీ ద్వారా సునీల్ ఇంటికి బెంగళూరు నుంచి ఎనిమిది బాక్సులు డెలివరీ అయ్యాయి. ఈ బాక్సుల్లో బెంగళూరులో ఓ కంపెనీలో పని చేస్తున్న సునీల్ లఖేటే కుమార్తెకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచే పని చేస్తూ నాగపూర్‌లో ఉండిపోయింది. దీంతో తాను ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాలని నిర్ణయించుకుంది.

ఆమెకు సంబంధించిన వస్తువులను ఎనిమిది బాక్సుల్లో ప్యాక్ చేసాడు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి. వాటన్నింటినీ కొరియర్ సర్వీస్ కంపెనీ ద్వారా నాగపూర్‌ ఇంటికి పంపించారు. అయితే, అంద‌రినీ షాక్‌కు గురిచేసే విధంగా, వారు ఊహించనిది అందుకున్నారు. బాక్సులు ఓపెన్ చేస్తుంటే పాము బుసలు కొట్టిన శబ్దం విని భయభ్రాంతులకు గురయ్యారు.

ఊహించని ఈ పరిణామానికి షాక్‌లో ఉన్న కుటుంబసభ్యులు తేరుకోక ముందే నాగుపాము బయటకు వచ్చి ఇంటి సమీపంలోని కాలువలోకి వెళ్ళింది. కుటుంబీకులు వెంటనే పాము పట్టే వ్యక్తికి ఫోన్ చేసినా స్నేక్ క్యాచర్స్ దాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు. అయితే, బాక్సులోకి నాగుపాము ఎలా వచ్చిందనేది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది.

బాక్సులను తరచి చూడగా పాము బయటకు వచ్చిన బాక్సులో రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి వచ్చిన బాక్సులు నాగ్‌పూర్‌లోని కొరియర్ కంపెనీ గోడౌన్‌లో పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో నాగుపాము బాక్సులో దూరి ఉంటుందేమో అని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నాగుపాము ఎవర్నీ ఏమీ చేయకుండా తన దారిన తాను వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News