Narendra Singh Tomar : నేనలా అనలేదు... మంత్రి యూటర్న్‌..!

Narendra Singh Tomar :రైతు చట్టాలు మళ్లీ తెస్తామని.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంరేగడంతో ఆయన యూటర్న్‌ తీసుకున్నారు.

Update: 2021-12-26 15:00 GMT

Narendra Singh Tomar : రైతు చట్టాలు మళ్లీ తెస్తామని.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంరేగడంతో ఆయన యూటర్న్‌ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను అలా అనలేదని.. కేంద్రం మళ్లీ చట్టాలు తీసుకొస్తుందని తానెప్పుడూ చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యల్లో వేరే అర్థం ఉందంటూ చెప్పుకొచ్చారు.

మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తోమర్.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని.. భవిష్యత్తులో మళ్లీ చట్టాలు తెస్తామని ప్రకటించి తేనె తుట్టెను కదిపారు. మూడు సాగు చట్టాల రద్దుతో వివాదం సద్దుమణిగిందనుకుంటున్న దశలో తోమర్‌ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మరోసారి ఆజ్యం పోయాయి. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాయి. రైతు సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.

నిజానికి వ్యవసాయ రంగంలో సంస్కరణలో భాగంగా మోదీ సర్కారు.. గత ఏడాది సాగు చట్టాలను తీసుకొచ్చింది. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళనలు నిర్వహించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ నుంచి లక్షలాదిగా తరలివచ్చిన రైతులు ఢిల్లీని వణికించారు. సరిహద్దుల్లోనే స్థావరాలు ఏర్పరుచుకుని చట్టాల రద్దు కోసం పోరాడారు. ఏడాది కాలంగా కొనసాగిన వారి ఉద్యమానికి ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం దిగివచ్చింది.

ఎవరూ ఊహించని విధంగా చట్టాలపై వెనక్కి తగ్గిన ప్రధాని మోదీ.. వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. మాట ఇచ్చిందే తడవుగా కార్యాచరణ ప్రారంభించారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదించి. వెంటనే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి వేయించారు. ప్రతిపక్షాలు నోరుతెరవకుండా కట్టడి చేశారు. ఈ అసాధారణ చర్య అందరినీ నివ్వెరపరిచినప్పటికీ…రైతులకు మేలు జరిగిందని అంతా సంతోషించారు.

సాగు చట్టాల రద్దు బిల్లు సమయంలోనే విపక్షాలు అనుమానాలు వ్యక్తంచేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల కోసం చేస్తున్నారంటూ దెప్పిపొడిచాయి. ఇప్పుడు కేంద్రమంత్రి తోమర్ చేసిన యూటర్న్ వ్యాఖ్యలతో రైతు సంఘాలు, ప్రతిపక్షాల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది..? అనేది చూడాలి.

Tags:    

Similar News