National : మూడో ఫ్రంట్ దిశగా మమత, అఖిలేష్

Update: 2023-03-17 12:51 GMT


మూడో ఫ్రంట్ దిశగా అఖిలేష్ యాదవ్, మమత బెనర్జీ అడుగులు వేస్తున్నారు. ఈ రోజు కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మూడో ఫ్రంట్ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మమత బెనర్జీ వచ్చే వారం బిజూ జనతాదళ్‌ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలవనున్నారు. కేంద్రంలోని కీలక ప్రతిపక్ష పార్టీలు... కాంగ్రెస్, బీజేపీని ఆమడ దూరంలో ఉంచడానికి అంగీకరించాయని తెలిపారు. 


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష పార్టీల సమూహానికి కీలక నేతగా చూపించే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని అన్నారు మమత. ఇటీవల లండన్‌లో ప్రసంగిస్తూ భారత పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతల మైక్‌లు మ్యూట్‌ చేశాయని ఆరోపించిన రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. రాహుల్ ను ఉపయోగించి బీజేపీ తమను లక్ష్యంగా చేసుకుంటోందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయని చెప్పారు.


రాహుల్ గాంధీ లండన్ లో పలు వ్యాఖ్యలు చేశారని అన్నారు టీఎంసీ నేత, ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ. రాహుల్ క్షమాపణ చెప్పే వరకు బీజేపీ పార్లమెంట్‌ను నడపనివ్వదని చెప్పారు. దీని అర్థం...  కాంగ్రెస్‌ను ఉపయోగించుకుని పార్లమెంటును నడపాలని బీజేపీ కోరుకోవడం లేదని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని ఆయన అన్నారు. "ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 23న నవీన్ పట్నాయక్‌ను కలుస్తారు. మేము ఇతర ప్రతిపక్ష పార్టీలతో మూడో ఫ్రంట్ గురించి చర్చిస్తాము" అని సుదీప్ మీడియాకు చెప్పారు.


"బెంగాల్‌లో, మేము మమతా దీదీతో ఉన్నాము. ప్రస్తుతం, మా స్టాండ్ బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము" అని యాదవ్ కోల్‌కతాలో మీడియాతో అన్నారు. 'బీజేపీ వ్యాక్సిన్' పొందే వారికి సీబీఐ, ఈడి, ఐటి ఇబ్బంది లేదు," అని ఆయన అన్నారు 

Similar News