పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెయిల్ పొడిగించింది సూరత్ సెషన్ కోర్టు. రాహుల్ బెయిల్‌ను ఈ నెల 13వరకు పొడిగించింది. అయితే అదే సమయంలో సూరత్ కోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణ మే 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే రాహుల్ గాంధీ రెండు అంశాలపై సూరత్ కోర్టు తీర్పును సెషన్ కోర్టులో సవాలు చేశారు. తనకు రెండేళ్లు జైలు శిక్ష విధించడం, తనను దోషిగా తేల్చడంపై స్టే ఇవ్వాలని సూరత్ కోర్టును కోరారు. అయితే ఆ రెండింటిపై స్టేకు కోర్టు నిరాకరించిన ధర్మాసనం... బెయిల్ మాత్రం పొడిగించింది.
2019లో మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్‌కు 30 రోజుల సమయం ఇచ్చింది. ఇక ఈ కేసు కారణంగా ఇప్పటికే రాహుల్ గాంధీ తన పదవి కోల్పోయారు. తాజాగా సూరత్ కోర్టు తీర్పును రాహుల్ సవాల్ చేశారు. సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ తన పిటిషన్‌లో కోరారు.. అలాగే సెషన్స్ కోర్టులో దీనిపై తీర్పు వెలువడే వరకు.. కింది కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని అభ్యర్థించారు.. రాహుల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.... ఆయన బెయిల్ మాత్రమే పొడిగిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.