Bihar: మధ్యాహ్న భోజనంలో బల్లి.. 200 మంది విద్యార్ధులకు అస్వస్థత
Bihar: బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ఒక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం తిన్న 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.;
Bihar: బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ఒక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం తిన్న 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భోజనం చేసిన ఓ విద్యార్థి ట్యూషన్ క్లాస్‌కు రాగానే వాంతులు చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటికే మిగతా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.
పాఠశాల యాజమాన్యం అస్వస్థతకు గురైన విద్యార్థులను సమీపంలోని వైద్యశాలకు తరలించి ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. నౌగాచియా సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆసుపత్రిలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, పాఠశాల అధికారులు తమకు బలవంతంగా భోజనం పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థి ప్లేట్‌లో చనిపోయిన బల్లి కనిపించిందని వారు ఆరోపించారు. దీనిపై వారు ప్రిన్సిపాల్ చిత్తరంజన్ ప్రసాద్ సింగ్‌కు ఫిర్యాదు చేయగా.. అది బల్లి కాదని వంకాయ అని చెప్పారు. "ఇది తినండి, ఇది బల్లి కాదు వంకాయ" అని పాఠశాల అధికారి విద్యార్థులకు చెప్పారు. ఈ విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లిందని, పాఠశాల ప్రిన్సిపాల్‌తోపాటు ఇతరులపై నేరం రుజువైతే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.