ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 14వ రోజుకు చేరుకున్నాయి. నిన్న అమిత్ షాతో భేటీ తర్వాత... కేంద్రం ఈ రోజు సవరణలతో పలు ప్రతిపాదనలను రైతులకు పంపింది. వీటిలో మార్కెట్ యార్డ్‌లను బలోపేతం చేయడం.. APMCల్లో ఫ్రీ మార్కెట్‌లో ఒకే ట్యాక్స్ విధానం... ప్రైవేటు కొనుగోలుదారుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం.. ప్రైవేటు వ్యక్తులతోపాటు ప్రభుత్వం కూడా పంటసేకరణకు హామీ ఇవ్వడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటితోపాటు.. కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదాల పరిష్కారంలో డిప్యూటీ కలెక్టర్ల అధికారాల సవరణ.. రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ.. కనీస మద్దతు ధర MSPపై రాత పూర్వక హామీతోపాటు.. పంట వ్యర్థాల దహనంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయంతో విధానం రూపొందించడం వంటివి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై.. కాసేపట్లో రైతుల సంఘాల నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 5 గంటల లోపు.. రైతు సంఘాలు తమ నిర్ణయం వెలువరించే అకాశం ఉంది. కేంద్ర ప్రతిపాదనల నేపథ్యంలో మరో దఫా చర్చలకు అవకాశం లేదని రైతు సంఘాలు అంటున్నాయి. కేంద్ర వైఖరినిబట్టే ఆందోళనలపై రైతు సంఘాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలపై విపక్ష నేతలు నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరీ, సీపీఐ నాయకుడు డి.రాజా, డీఎంకే నేత టీకేఎస్ ఎలన్‌గోవన్ కలిసి రాష్ట్రపతితో సమావేశం కానున్నారు. అంతకుముందు శరద్‌పవార్ నివాసంలో విపక్షాల భేటీ జరగనుంది.