Parliament monsoon sessions : రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!

దేశంలో ద్రవ్యోల్బణం, సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొన్న తీరుపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Update: 2021-07-18 15:30 GMT

రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం, సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొన్న తీరుపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కరోనా విజృంభిస్తోన్న తరుణంలో సరిగా వ్యవహరించడం లేదంటూ కేంద్రంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది. కొవిడ్, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, రైతుల ఉద్యమం, రఫేల్‌ డీల్‌, ధరల పెరుగుదలతోపాటు ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇప్పటికే నిర్ణయించింది. అటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ సమస్యలను ప్రధానంగా లేవనెత్తనున్నాయి. ముఖ్యంగా కేంద్ర జల్‌శక్తి గెజిట్‌ నోటిఫికేషన్‌ అంశంపై టీఆర్ఎస్ గళమెత్తనుంది. మరోవైపు విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ ఉక్కు వంటి అంశాలను లేవనెత్తాలని వైసీపీ...ఏపీ ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతల అంశాలపై ప్రశ్నించాలని తెలుగుదేశం నిర్ణయించాయి.

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో నిర్వహించిన ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అధికారపక్షం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను మంత్రి ప్రహ్లాద్‌ జోషి అఖిలపక్ష నాయకులకు వివరించారు. ఈ సమావేశాల్లో దాదాపు 31 బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. దాదాపు అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలపక్షానికి తెలిపింది. ఇక అమలులో ఉన్న ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జనాభా నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో పాటు విద్యుత్‌ బిల్లులను కూడా మరోసారి సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

మొత్తానికి అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని విపక్షాలు సిద్ధమవగా.. వారి ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ ఇప్పటికే మంత్రులకు సూచించారు. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ అన్ని పార్టీలు ప్రజలపక్షాన నిలవాలని.. పార్లమెంట్‌ సమావేశాల్లో పౌరులకు సంబంధించిన సమస్యలపై ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగేలా చూడాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై, ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఉభయ సభలు కూడా ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.

Tags:    

Similar News