Tamil Nadu Rains: మొన్న ఏపీ.. నేడు తమిళనాడు.. వరదలతో ప్రజల అవస్థలు..

Tamil Nadu Rains: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది.

Update: 2021-11-27 11:30 GMT

Tamil Nadu Rains (tv5news.in)

Tamil Nadu Rains: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నైసహా తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్‌, శివగంగ, దిండిగుల్‌, మధురైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో.. ఎనిమిది మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ముగ్గురు శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

వరద బాధితుల కోసం 109 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. చింగ్లేపేట, కాంచీపురంలో రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. పుదుచ్చేరిలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కేప్‌ కొమోరిన్ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా తుపాను ఆవరించి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో తమిళనాడు తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఈ మూడు రోజుల్లో తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పుదుచ్చేరి, కరైకల్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ ప్రాంతాల్లోని జాలరులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. దీంతోపాటు దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చెన్నైతోసహా ఇక్కడి 21 ఒక్క జిల్లాల్లో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది

Tags:    

Similar News