ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీకి పేరు..

Update: 2020-09-01 01:17 GMT

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీకి పేరు... 47 ఏళ్ల వయసులో తొలిసారి ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. అణు ఒప్పందం వ్యవహారంలోనూ అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా అమెరికా అధ్యక్షుడితో మంతనాలు జరిపిన సమర్ధత ఆయనది. ఇందిరా గాంధీ హయాంలో 1982 నుండి 1984 వరకు ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ పనిచేశారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలోనూ 2009 నుండి 2012 మధ్య రెండోసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సరళీకరణ ఆర్థిక విధానాలకు ముందు, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా విధులు నిర్వర్తించిన వారు ప్రణబ్‌ ముఖర్జీనే. 1982-83లో తొలి వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదటి సంస్కర్తగా ప్రణబ్‌ గుర్తింపు పొందారు. ఇందిరా హయాంలో ప్రపంచ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మేగజైన్‌ సర్వేలో గుర్తించబడ్డారు.

పీవీ నర్సింహారావు హయాంలో ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు ప్రణబ్‌ ముఖర్జీ. ఈ కాలంలోనే మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థకు ముగింపు పలికారు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడింది. ఆ తర్వాత 2009లో మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రణబ్‌. 2009-2010, 2011 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. 2008-09లో 6.5 శాతం నుండి 2010-11 బడ్జెట్‌లో జీడీపీ అనుపాతంగా ప్రజా రుణాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012-13 సంవత్సరం నాటికి జీడీపీలో బడ్జెట్‌ లోటును 4.1 శతానికి తగ్గించారు.

అంతేకాకుండా అనేక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఫ్రింజ్‌ బెనిఫిట్స్‌ ట్యాక్స్‌, కమోడిటీస్‌ ట్రాన్సాక్షన్స్‌ను రద్దు చేశారు. తన పదవీ కాలంలో గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ పన్నును అమలు చేశారు. రెస్టోస్పెక్టివ్‌ పన్నులను పరిచయం చేశారు. దీనిపై కొంతమంది ఆర్థిక వేత్తలు పెదవి విరిచారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్‌ పెంచారు. ఎదుగుతున్న మార్కెట్‌కు సంబంధించి 2010లో ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఫర్‌ ఆసియా అవార్డు సొంతం చేసుకున్నారు ప్రణబ్‌.

2009-10 బడ్జెట్‌లో సీనియర్‌ సిటిజన్లకు, మహిళలకు ఆదాయపు పన్ను పరిమితి ఊరట కల్పించారు ప్రణబ్‌. ఆడ పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణకు నిధులను పెంచారు. ఎలక్ట్రిసిటీ కవరేజ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యూవల్‌ మిషన్‌ వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలను విస్తృతపరిచారు. 1970, 1980 దశాబ్ధాల్లో రూరల్‌ బ్యాంక్స్‌, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఐఎఫ్‌ఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఆఫ్రికన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి వాటికి సేవలు అందించారు. తద్వారా భారత్‌ను గర్వించేలా చేశారు ప్రణబ్‌ ముఖర్జీ.

Tags:    

Similar News