IRCTC : మోసాలకు చెక్.. రైల్వే టికెట్ బుకింగులో అమల్లోకి వచ్చిన ఐఆర్‌సీటీసీ కొత్త రూల్.
IRCTC : భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో పారదర్శకతను పెంచడానికి, అక్రమాలను అరికట్టడానికి ఐఆర్‌సీటీసీ ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇకపై ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య రైలు టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ నిర్ణయం, ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో నిజమైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు అందేలా చూడటం, మోసాలను అరికట్టడం లక్ష్యంగా తీసుకున్నారు. ఈ కొత్త నియమం అక్టోబర్ 28 నుండే అమల్లోకి వచ్చింది.
భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య రైలు టికెట్లను బుక్ చేసే విధానంలో మార్పులు చేసింది. ఈ రెండు గంటల సమయం ప్రముఖ రైళ్లలో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే సమయం. ఈ సమయంలో ఆధార్ వెరిఫై అయిన వినియోగదారులకు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ ఖాతాలను ఉపయోగించడం లేదా ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ల ద్వారా అక్రమ బుకింగ్‌లు చేయడం వంటి మోసాలను అరికట్టడమే ఈ నియమం వెనుక ప్రధాన లక్ష్యం.
ఆధార్ లింక్ చేయని వినియోగదారులు ఉదయం 8 నుండి 10 గంటల మధ్య కాకుండా మిగిలిన ఏ సమయంలోనైనా యథావిధిగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త నియమం అక్టోబర్ 28 నుండి అమల్లోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీలో ఆధార్ తప్పనిసరి చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తత్కాల్ టికెట్ బుకింగ్‌తో సహా పలు మార్పులు వచ్చాయి. గతంలో, జూలై 1 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ఆ తర్వాత, జూలై 15, 2025 నుంచి ఆన్‌లైన్, ఏజెంట్ లేదా పీఆర్‌ఎస్ కౌంటర్లలో టికెట్ బుకింగ్ కోసం ఓటీపీ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్‌ను కూడా ప్రవేశపెట్టారు.
ఐఆర్‌సీటీసీలో ఆధార్ వెరిఫికేషన్ విధానం
ఇంకా ఆధార్‌ను తమ ఐఆర్‌సీటీసీ ఖాతాకు లింక్ చేయని వారు, సులభంగా కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
స్టెప్ 1: ముందుగా http://www.irctc.co.in వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: My Profile లోకి వెళ్లి User Verification ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ID ని నమోదు చేసి, వివరాలు సరిచూసుకొని Verify Details పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్ చేయండి.
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీరు ఉదయం 8 నుంచి 10 గంటల స్లాట్‌తో సహా ఏ సమయంలోనైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త నిబంధనలు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తాయి. పీఆర్‌ఎస్ కౌంటర్‌లో టికెట్ తీసుకునే పద్ధతిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. టికెట్ బుకింగ్‌ను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, నిజమైన ప్రయాణికులకు సులభతరం చేయడానికి రైల్వే తీసుకున్న చర్యలలో ఇది ఒక భాగం.