President Draupadi Murmu : రాములవారి సందర్శనలో రాష్ట్రపతి..

President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భద్రచలం, రామప్పలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్నారు

Update: 2022-12-28 08:02 GMT

President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భద్రచలం, రామప్పలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 41.3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది.. ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


ఇప్పటికే ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాసేపట్లో రాష్ట్రపతి ఐటిసి పేపర్ మిల్లులోని ఎలిప్యాడ్ లో దిగనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన భద్రాచలం చేరుకోనున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో పాటు భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ వద్ద వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.


భద్రాచలం పర్యటన ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు వెళ్లనున్నారు. ములుగు జిల్లాలోని యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆమె సందర్శించనున్నారు. దర్శనానంతరం సుమారు 62 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్ల క్రితం తొలగించిన కామేశ్వరాలయ పునర్ నిర్మాణ పనులతో పాటు రామప్ప ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించనున్నారు.



ఇక రాష్ట్రపతి రాక సందర్భంగా రామప్ప దేవాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అలజడి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు ప్రత్యేక హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ బృందం ఏర్పాట్లను పర్యవేక్షించింది. నిన్న, ఇవాళ రామప్పను దర్శించుకునేందుకు సాధారణ భక్తులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News