GAS: గ్యాస్ "ట్రబుల్స్"
మన వంటింటి వరకూ ;చేరుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మంట
ఇరాన్-ఇజ్రాయెల్ సెగ మన వంటింటి వరకూ చేరింది. గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. హాస్టళ్లు మెనూను కోసేస్తున్నాయ్. ఏజెన్సీలో బుకింగ్స్‌లో గడువు నిర్దేశిస్తున్నాయ్. సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలు బారులు తీరుతున్నాయ్. మొత్తంగా దేశంలో గ్యాస్ కష్టాలు రెట్టింపయ్యాయి. గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో కేంద్రం రంగంలోకి దిగి నాలుగు ప్రాథమిక రంగాలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తామని ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలు ఇప్పుడు దేశీయ వ్యాపార రంగాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత నెలకొంది. ఈ ప్రభావం తెలంగాణలోని హోటల్, రెస్టారెంట్ రంగంపై తీవ్రంగా పడుతోంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో అనేక హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో నెలకు సుమారు ఎనిమిది లక్షల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల వినియోగం ఉండగా, ఈ రంగం దాదాపు రూ.150 కోట్ల మార్కెట్‌గా విస్తరించి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల వరకు కమర్షియల్ సిలిండర్లు వినియోగంలో ఉంటాయి. అయితే ఇటీవల గ్యాస్ సరఫరా తగ్గుముఖం పట్టడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే మెనూలను పరిమితం చేసి గ్యాస్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. సరఫరా త్వరగా సాధారణ స్థితికి రాకపోతే మరికొద్ది రోజుల్లోనే అనేక హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చే పరిస్థితి ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
కీలక నిర్ణయాలు
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై సభ్యులు చర్చించి భవిష్యత్ చర్యలపై ఆలోచించారు. పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు బంద్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని సంఘం నాయకులు హెచ్చరించారు. హోటల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి అవసరమైన ఎల్పీజీ సరఫరాలో దాదాపు 62 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ప్రభావితమయ్యాయి. దీంతో భారత్‌కు గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. అదేవిధంగా సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుంచి కూడా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కమర్షియల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాను తగ్గించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు సూచించినట్లు తెలుస్తోంది. గృహ వినియోగదారుల అవసరాలను ముందుగా తీర్చాలని కేంద్రం సూచించినట్లు సమాచారం.