Charanjit Singh Channi : ఆటోలపై ఉన్న చలాన్లు రద్దు చేస్తా.. కేజ్రీవాల్‌కు షాక్‌ ఇచ్చిన పంజాబ్ సీఎం..!

Charanjit Singh Channi : పెండింగ్‌లో ఉన్న చలాన్లను మాఫీ చేస్తామని సంచలన ప్రకటన చేసి ఆటో డ్రైవర్ల పై వరాల జల్లు కురుపించారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ.

Update: 2021-11-23 15:15 GMT

Charanjit Singh Channi : పెండింగ్‌లో ఉన్న చలాన్లను మాఫీ చేస్తామని సంచలన ప్రకటన చేసి ఆటో డ్రైవర్ల పై వరాల జల్లు కురుపించారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. అంతేకాకుండా వారికి కొత్త రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తానని ప్రకటించారు. సోమవారం లూథియానాలోని గిల్ చౌక్ ప్రాంతంలోని ధాన్యం మార్కెట్‌కు వెళ్తున్న సీఎం.. మార్గమధ్యంలో తన వాహనాన్ని ఆపి అక్కడ ఆటోడ్రైవర్లతో భేటీ అయ్యారు.

వారితోనే ఓ చెక్కపైనే కూర్చొని టీ తాగుతూ వారి సమస్యలను విన్నారు. అనంతరం ఇప్పటివరకు ఆటోల మీద ఉన్న పెండింగ్‌ చలాన్లు అన్నింటిని రద్దు చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా అధికారుల వేధింపులను అరికట్టేందుకు త్వరలో కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు గతంలో ఆటో డ్రైవర్‌‌‌గా పనిచేశానని చెప్పుకొచ్చారు. అందుకే నిజమైన డిమాండ్లను సానుభూతితో పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు.

ఇక ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని చన్నీ కోరారు. ఆటో రిక్షాలు నడపడానికి ప్రత్యేకంగా పసుపు గీత గీసి స్థలాన్ని కేటాయించాలని కోరిన ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. అయితే సీఎం చన్నీ ప్రకటన పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ఆయన ఆటో డ్రైవర్ లతో ఆటో సంవాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు కేజ్రీవాల్‌. కానీ దీనికి ముందే పంజాబ్ సీఎం వారితో భేటి అవ్వడం, చలాన్లను మాఫీ చేస్తామని ప్రకటన చేయడం కేజ్రీవాల్‌‌‌‌కి షాకిచ్చినట్టు అయింది.

Tags:    

Similar News