రాజేంద్ర ప్రసాద్ కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదు..
అయితే తన కొడుకునీ హీరో చెయ్యాలని ఆయనా కలలు కన్నారు.;
హేమా హేమీల వారసులంతా సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్న ప్రస్తుత రోజుల్లో నవ్వుల రాజు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన వారసుడిని సినిమాల్లోకి ఎందుకు తీసుకు రాలేదు. 60 ఏళ్లు పైబడినా సినిమాల్లో నటిస్తూ, ప్రేక్షకులను నవ్విస్తూ, మరికొన్ని పాత్రల్లో ఏడిపించే రాజేంద్రుడికి కొడుకు బాలాజీ ఉన్నాడు. పైగా అచ్చంగా తండ్రి పోలికలతో అందగానూ ఉన్నాడు. అయినా సినిమాల్లోకి రాలేదు. తన కొడుకునీ హీరో చెయ్యాలని ఆయనా కలలు కన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతిలో పెట్టి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయమన్నాడు.
భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అందరూ దొంగలే లాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నాడు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాలతో ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక అది అలానే కంటిన్యూ అవడంతో బాలాజీకి సినిమాలు చేయాలనే ఆసక్తి సన్నగిల్లింది.
ఆదిలోనే ఆటంకం ఎదురైందని భావించాడు. నటన మీద ఆసక్తి కనబరచలేకపోయాడు. దాంతో తండ్రి కలను నిజం చేయలేకపోయాడు. మరోసారి ప్రయత్నించమని తండ్రి రాజేంద్రప్రసాద్ ఎన్ని సార్లు చెప్పినా బాలాజీ వినలేదు. నిర్మాతగా తానే మారి కొడుకుని హీరోని చేస్తానన్నా బాలాజీ ససేమిరా అన్నాడు. ప్రస్తుతం బాలాజీ తనకు ఇష్టమైన రంగం ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయానన్న దిగులు మాత్రం రాజేంద్ర ప్రసాద్‌లో కనబడుతుంది. 40 ఏళ్ల నటప్రస్తానం ఉన్న రాజేంద్రుడికి ఆమాత్రం అనిపించడంలో అర్థం ఉంది.