శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

Update: 2021-01-02 04:52 GMT

శబరిమలలో కరోనా కేసులు పెరగడం కలవరం రేపుతోంది. దీంతో శబరిమలను కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చాలా వద్దా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆరుగురు అర్చకులతో పాటు సన్నిధానం పనిచేసే 37 మందికి కరోనా సోకింది. మరో రెండు వారాల్లో మకరజ్యోతి దర్శనం ఉండడం, ఇరుముడి సమర్పించేందుకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో.. ఏ నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తోంది శబరిమల దేవస్థానం బోర్డు.

శబరిమల మకరవిలక్కు ఉత్సవాల కోసం ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే శబరిమలలో మకరవిలక్కు పూజలు మొదలయ్యాయి కూడా. ఇలాంటి సమయంలో శబరిమల ఆలయంలో ప్రధాన అర్చకుడితో పాటు ఆయన ఆరు మంది సహాయకులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శబరిమల అర్చకులతో పాటు సన్నిధానంలో పనిచేస్తున్న 37 మందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌లోకి తీసుకురావాలా లేదా అనే విషయంపై దేవస్వం బోర్డు అధికారులు చర్చిస్తున్నారు.

శబరిమల ప్రధాన అర్చకుడు జయరాజ్ సహ ఆయన ఆరు మంది సహాయకులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురితో ఈ అర్చకులు టచ్ లోకి రావడం వలనే వారికి కరోనా వైరస్ సోకిందని అధికారుల విచారణలో తేలింది. శబరిమల ప్రధాన అర్చకుడు జయరాజ్ తో పాటు ఆయన సహాయకులు ప్రస్తుతం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.

శబరిమల సన్నిధానంలో పని చేస్తున్న ప్రధాన అర్చకులతో పాటు ఆరు మంది అర్చకులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిన వెంటనే సన్నిధానంలో పని చేస్తున్న అర్చకులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో అయ్యప్పస్వామి భక్తులతో టచ్‌లో ఉన్న అర్చకులు, అక్కడి సిబ్బందికి ఎప్పటికప్పుడు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు నిర్ణయించారు.

శబరిమల సన్నిధానంలో ప్రధాన అర్చకుడితో పాటు అర్చకులకు వంట చేసే అర్చకుడు ఆయన సహాకులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో అధికారులు హడలిపోయారు. పవిత్ర పుణ్యక్షేత్రం, అయ్యప్ప భక్తుల యాత్ర కొనసాగుతున్న సందర్బంలో శబరిమల సన్నిధానం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌లో పెట్టాలా వద్దా అనే విషయంపై దేవస్వం బోర్డు అధికారులు చర్చిస్తున్నారు.



Tags:    

Similar News