MARRIAGE: పెళ్లంటే వెనకడుగు - స్వేచ్ఛ వైపే ముందడుగు
వివాహంపై మారుతున్న యువత ధోరణి
భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎప్పటికీ ఒక కీలకమైన స్థంభంగా నిలిచింది. వ్యక్తి జీవితం నుంచి సమాజ నిర్మాణం వరకు కుటుంబం కేంద్ర పాత్ర పోషించింది. ఆ కుటుంబ వ్యవస్థలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల బంధం మాత్రమే కాదు; అది సంస్కృతి, బాధ్యత, పరస్పర సహకారం, తరతరాల కొనసాగింపును ప్రతిబింబించే సామాజిక వ్యవస్థ. అయితే ప్రస్తుతం భారతీయ సమాజంలో చాలా నిశ్శబ్దంగా ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంటోంది. అది ఏమిటంటే యువతలో పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి తగ్గిపోవడం, పెళ్లిని నిరంతరం వాయిదా వేయడం. ఒకప్పుడు సహజ జీవన దశగా భావించిన పెళ్లి ఇప్పుడు అనేక సందేహాలు, భయాలు, అంచనాలు, ఆర్థిక లెక్కలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాల మధ్య చిక్కుకుపోతున్నట్టు కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు భారతీయ కుటుంబ వ్యవస్థలో పెళ్లి ఒక సాధారణమైన, సహజమైన దశ. సాధారణంగా ఇరవై నుంచి ఇరవై అయిదేళ్ల మధ్య యువకులు పెళ్లి చేసుకోవడం సమాజంలో సాధారణంగా భావించబడేది. కుటుంబ పెద్దలు చూసిన పెళ్లిళ్లు, కుటుంబాల మధ్య బంధాలు, ఆ తరువాత పిల్లలు, కుటుంబ బాధ్యతలు — ఇవన్నీ కలిసి వ్యక్తి జీవితానికి ఒక దిశను ఇచ్చేవి. సమాజం కూడా ఈ విధానాన్ని అంగీకరించి, కుటుంబ వ్యవస్థను బలంగా నిలబెట్టేది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాల్లో భారతీయ సమాజం వేగంగా మారుతున్న నేపథ్యంలో పెళ్లి వ్యవస్థలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మారిపోయిన సెటిల్ అర్థం
నేటి యువతలో తరచుగా వినిపించే మాటలు “ఇంకా సెటిల్ కాలేదు”, “సరైన భాగస్వామి దొరకలేదు”, “పెళ్లి అంటే బాధ్యతలు ఎక్కువ”, “స్వేచ్ఛ తగ్గిపోతుంది”, “విడాకుల ప్రమాదం ఉంది”. ఈ అభిప్రాయాలు ఇప్పుడు అరుదు కావు. ఇవి ఒక కొత్త తరం ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పెళ్లిని జీవితంలో తప్పనిసరి దశగా కాకుండా, ఒక ఎంపికగా చూస్తున్న యువత సంఖ్య పెరుగుతోంది. చరిత్రను పరిశీలిస్తే భారతీయ సంస్కృతిలో పెళ్లికి ఒక పవిత్రమైన స్థానం ఉంది. అది కేవలం వ్యక్తిగత సంబంధం కాదు; ఒక సామాజిక ధర్మంగా భావించబడింది. కుటుంబ వ్యవస్థ సమాజానికి ఆర్థిక, సాంస్కృతిక, భావోద్వేగ బలం ఇచ్చేది. పిల్లల పెంపకం నుంచి విలువల పరంపర కొనసాగింపువరకు కుటుంబమే ప్రధాన ఆధారం. అందుకే పెళ్లి చేయకపోవడం ఒక అసాధారణమైన విషయం అని భావించబడేది. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన పారిశ్రామిక విప్లవం తరువాత కుటుంబ వ్యవస్థలో మార్పులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నగరీకరణ, విద్య విస్తరణ, వ్యక్తిగత స్వేచ్ఛ పెరుగుదల వంటి అంశాలు సమాజ నిర్మాణాన్ని ప్రభావితం చేశాయి. గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరగడంతో కుటుంబాలు చిన్నవయ్యాయి. నగర జీవితం వ్యక్తిగతతను పెంచింది. అదే సమయంలో యువత ఎక్కువ కాలం చదువుకోవడం ప్రారంభించింది. ఉద్యోగం, కెరీర్, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు జీవితంలో ప్రధాన ప్రాధాన్యం పొందాయి. వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరగడంతో పెళ్లి వంటి నిర్ణయాలు కూడా ఆలస్యమవుతున్నాయి.