రోల్డ్‌గోల్డ్ నగలపై రుణం ఇప్పించి.. రూ. 3 కోట్లకు పైగా సంపాదించి
దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిందాకా బ్యాంక్ మేనేజర్లు అతడు చేస్తున్న మోసాన్ని గుర్తించకపోవడం గమనార్హం.;
నడిచినంత కాలం నడిపిద్దాం.. ఏదైనా వస్తే అప్పుడు చూసుకుందాం అని తను పని చేసే బ్యాంకులోనే దుకాణం తెరిచాడు. మేనేజర్‌కు తెలియకుండా మేనేజ్ చేశాడు. దాదాపు రూ.3 కోట్లకు పైగా కొల్లగొట్టిందాకా బ్యాంక్ మేనేజర్లు అతడు చేస్తున్న మోసాన్ని గుర్తించకపోవడం గమనార్హం. నగ నకిలీదో కాదో చెప్పే ఉద్యోగం.. అదే అతడిని కోటీశ్వరుడ్ని చేసింది.. ఆ తరువాత కటకటాలపాల్జేసింది. హైదరాబాద్ తుక్కుగూడ యూనియన్ బ్యాంకులో తల్లోజ్ సాయినాథ్ గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ బ్యాంకుకు వచ్చే నగలు నకిలీవో కావో చెప్పి వారికి బ్యాంకు లోన్ వచ్చేలా చేస్తున్నాడు.
ఇలా ఉండగా ఓ రోజు ఓ బ్రహ్మాండమైన ఆలోచన చేశాడు. అందులో భాగంగానే బంధువులు, స్నేహితులకు తన పథకాన్ని చెప్పాడు.. రోల్డ్ గోల్డ్ నగలు తీసుకుని బ్యాంకుకు వచ్చి సాయినాథ్‌కి చూపించేవారు. అతడు వాటికి 100 శాతం ప్యూర్ గోల్డ్ అని ముద్ర వేసి బ్యాంకు మేనేజర్‌కు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్లకి లోన్ ఇప్పించేవాడు. పేరుకి రుణం వాళ్లు తీసుకున్నా ఆ సొమ్మంతా తరువాత తిరిగి అతడి ఖాతాలో జమచేయించుకునేవాడు.
ఆడిటింగ్ అప్పుడు కూడా అనుమానం రాకూడదని వేరే బ్యాంకుల్లో అప్రైజర్స్‌గా పనిచేస్తున్న తన బంధువులు సంతోష్, శివనాథ్‌లతోనే ఆడిటింగ్ చేయించేవాడు. అన్ని రోజులు మనవి కాదు కదా.. ఓ రోజు బ్యాంకు మేనేజర్ అనిల్ కుమార్‌కు ఎందుకో అనుమానం వచ్చి ఆరా తీశాడు. కానీ మేనేజర్‌కి కూడా డబ్బుని ఎరగా వేసి తనవైపు తిప్పుకున్నాడు. ఎలాగూ తెలిసింది కదా.. ఇద్దరం కలిసి రోల్డ్‌గోల్డ్ రుణాల దందా చేద్దామని మేనేజర్నీ పురిగొల్పాడు. మంజూరైన రుణాన్ని ఇద్దరూ పంచుకునేవారు.
ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్న వారి రోల్డ్ గోల్డ్ దందా. ఇంతలో మేనేజర్ అనిల్ కుమార్‌కు నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు బదిలీ అయింది. ఆ తరువాత అతడి స్థానంలో వచ్చిన డిప్యూటీ మేనేజర్ రామావత్ ప్రదీప్ కుమార్ కూడా సాయి దందాలో భాగస్వామి అయ్యాడు. అతడు కూడా ట్రాన్స్‌ఫర్ మీద వెళ్లి పోయాక మరో మేనేజర్ యశ్వంత్ రెడ్డి సాయినాథ్ సాగిస్తున్న దందా వ్యవహరంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సాయినాథ్ రోల్డ్‌గోల్డ్ గుట్టును రట్టు చేశారు ఈ దందాలో పాల్గొన్న కీలక వ్యక్తులందరినీ విచారించి అరెస్ట్ చేశారు. నిందితుడు సాయినాథ్ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో కూడా గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. అక్కడ కూడా ఇలాగే రూ.54.06 లక్షల రుణం తీసుకుని వారినీ బురిడీ కొట్టించారు. కష్టపడి సంపాదిస్తే వచ్చిన డబ్బు కాదు. అక్రమ సంపాదన అందుకే హాయిగా గోవా వెళ్లి స్నేహితులతో సరదా చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. సాయినాథ్ తుక్కుగూడలో ఖరీదైన ఇంటిని కొంటే.. అతడితో చేతులు కలిపిన మేనేజర్లు జడ్చర్లలో ఫ్లాట్లు కోనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.