రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసపై దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం
రైతులు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.;
రైతులు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. సున్నితమైన అంశంలో కేంద్రం చట్టపరంగా స్పందిస్తుందని కోర్టు తెలిపింది. పిటిషన్లను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సూచించారు సీజేఐ . ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లేందుకు పిటిషనర్లకు సుప్రీం అనుమతించింది.
మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులు జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. వేల మంది ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టి, పోలీసులపై దాడి చేసి, ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది విశాల్ తివారి వేసిన పిటిషన్ కూడా వీటిలో ఉంది. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయకుండా అధికారులు, మీడియాకు ఆదేశాలివ్వాలని మనోహర్ లాల్ శర్మ అనే మరో న్యాయవాది పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది.