బెంగళూరు సింగర్.. ఫ్లైట్‌లో వస్తుంది.. స్వాహా చేస్తుంది..

శ్రోతల్ని తన గానంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అలాగే చోర కళలో కూడా అందె వేసిన చేయి.;

Update: 2020-12-19 04:54 GMT

మహానగరంలో మాయగాళ్లు.. చోర కళలో సిద్ధహస్తులు. ఏం మాయ చేస్తారో.. ఎత్తులకు పై ఎత్తులు వేసి అమాయకుల్ని బుట్టలో పడేస్తారు.. అందినకాడికి దోచుకుంటారు. ఆమె బెంగళూరులో సింగర్.. శ్రోతల్ని తన గానంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అలాగే చోర కళలో కూడా అందె వేసిన చేయి. చిన్నా చితకా దొంగతనాలు చేసే చీప్ మెంటాలిటీ కానే కాదు.. మెట్రో నగరాల్లో మిరుమిట్లు గొలిపే షాపింగ్ మాళ్లు, బ్యూటీపార్లర్లను లక్ష్యంగా చేసుకుని చేతికి పనిచెబుతుంది.

అదేదో షాప్ ఓపెనింగ్‌కి ఫైట్ ఎక్కి వచ్చినట్టు చోరీ చేసేందుకు విమానం ఎక్కి వస్తుంది. దటీజ్ అర్చన బారువా (46) స్పెషాలిటీ. మున్మున్ హుస్సేన్ అనే మరో పేరుతో కూడా చెలామణి అవుతుంటుంది. పదేళ్లుగా మూడు పర్సులు, ఆరుహ్యాండ్ బ్యాంగులుగా సాగిపోతున్న తన బిజినెస్‌కు బ్రేక్ వేశారు ముంబయి పోలీసులు. రెండేళ్ల క్రితం శివాజీ పార్కులోని బ్యూటీపార్లర్‌కు వచ్చి మహిళ పర్స్ దొంగిలించింది. ఆ పర్సులో ఆభరణాలు, నగదు, మొబైల్ సహా రూ.4 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి.

ఆ తరువాత కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా ఓ మహిళ దొంగతనం చేసిందని తెలుసుకున్నారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే లోయర్ పరేల్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పర్స్ దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వీటన్నింటిని ఒక మహిళ చేస్తుందని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపారు. బెంగళూరులో ఆమెను పట్టుకుని అరెస్ట్ చేశారు.

మెట్రో పాలిటన్ నగరాలు.. ముంబయి, కోల్‌కతా, బెంగళూరులతో పాటు హౌదరాబాద్‌లోనూ చోరీలకు పాల్పడినట్లు పోలీసులకు పట్టుబడిన అనంతరం అర్చన చెప్పుకొచ్చింది. 2019 ఏప్రిల్‌లో సెంట్రల్ ముంబయిలోని ప్రఖ్యాత మాల్‌లో జరిగిన చోరీపై అందిన ఫిర్యాదుతో కూపీ లాగగా అర్చన నిందితురాలన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంతకుముందు దాదర్‌లోని ఓ మాల్‌తో పాటు బ్యూటీపార్లర్‌లోనూ ఇదే తరహాలో చోరీలు జరగడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్‌టవర్ లొకేషన్‌లను విశ్లేషించి ఆమె చిత్రాల్ని సేకరించారు. ఫేస్‌బుక్‌లో ఆమె చిత్రాలను పరిశీలించారు. దీంతో ఆ చోరీలకు పాల్పడింది అర్చన అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్‌లో ఆ సింగర్ చేసిన చోరీల గురించి తెలంగాణ పోలీసులకు ముంబయి పోలీసులు సమాచారం అందించారు. త్వరలోనే ఆమెను పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకు వచ్చే అవకాశం ఉంది. 

Tags:    

Similar News